chennai apollo hospital
-
నిర్మాత శివప్రసాద్ రెడ్డి కన్నుమూత
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి శనివారం (అక్టోబర్ 27) ఉదయం 6.30 నిమిషాలకు చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా హృదయ సమస్యలతో బాధపడుతున్న శివప్రసాద్‌కి ఇటీవల అపోలో హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపులో 1956లో డీవీ శేషారెడ్డి, సుదర్శనమ్మ దంపతులకు శివప్రసాద్‌రెడ్డి జన్మించారు. నెల్లూరులో హై స్కూల్ చదువును పూర్తి చేసిన ఆయన విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో బీఏ పట్టభద్రులయ్యారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ స్థాపించి శోభన్ బాబుతో ‘కార్తీక దీపం, శ్రావణ సంధ్య’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ సినిమాలు నిర్మించారు. ఆయన బ్యానర్లో ఎక్కువ శాతం నాగార్జునతోనే సినిమాలు చేశారు. వీళ్ల కాంబినేషన్లో 11 సినిమాలు వచ్చాయి. అందులో ‘అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ, గ్రీకువీరుడు’ తదితర చిత్రాలున్నాయి. 1987లో ‘విక్కీ దాదా’తో నాగార్జునకు, శివ ప్రసాద్‌కు స్నేహం మొదలైంది. అలా వీళ్ల అనుబంధం కొనసాగుతూనే ఉంది. నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ‘దడ’ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. నిర్మాతగానే కాకుండా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. నిర్మాతగా ‘గ్రీకువీరుడు’ ఆయన చివరి చిత్రం. సున్నితమైన ఎంటర్టైన్మెంట్, తెలుగు నేటివిటీకు తన సినిమాల్లో పెద్ద పీట వేశారు. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను. శివప్రసాద్ రెడ్డి నా కుటుంబానికి చాలా దగ్గరివాడు. నా 33 ఏళ్ల సినీ కెరీర్లో ప్రముఖుడు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ‘‘శివప్రసాద్‌రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి చిత్రం చేశారు. ఆయన సాత్వికుడు. నాకు మంచి మిత్రుడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి సంతాపం వ్యక్తపరిచారు. నేడు శివప్రసాద్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఆందోళన అక్కర్లేదు
దర్శకుడు మణిరత్నంకు గురువారం గుండెపోటు వచ్చింది. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు మణిరత్నం. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఆఫీస్‌లో ఉండగా గుండెపోటుకు లోనయ్యారు. తక్షణం అక్కడి సిబ్బంది, కుటుంబీకులు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆçస్పత్రికి తర లించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు చేస్తున్నారు. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. -
అమ్మ... అమృత..
ప్రతి మనిషి జన్మలోనూ ‘తల్లి నిజం.. నాన్న నమ్మకం’ అనేది ప్రాచీన నానుడి. తాను పలానా దంపతుల సంతానం అని చెప్పుకోవాలంటే సదరు భార్యాభర్త జీవించి ఉన్నపుడే ప్రకటించాలి. అది జరగనపుడు సశాస్త్రీయమైన తిరుగులేని విధానం డీఎన్ఏ పరీక్ష. అయితే డీఎన్ఏ పరీక్ష చేయాలంటే రక్త నమూనాలు తప్పనిసరి. జయలలిత తన తల్లి అంటున్న అమృత వాదనలోని నిజానిజాల కోసం జయ పార్థివదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి డీఎన్ఏ పరీక్షలు చేయవచ్చు. అంతటి అవకాశాలు కనుచూపుమేరలో లేవు. ఇక ఏకైక ప్రత్యామ్నాయం రక్తనమూనాలే. అపోలో ఆస్పత్రిలో జయ సుదీర్ఘకాలం చికిత్స పొందినపుడు వివిధ పరీక్షల కోసం సేకరించిన రక్తం ఉంటుందని కోర్టు భావించింది. అయితే సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశామని, తమ వద్ద నమూనాలు లేవని అపోలో తేల్చి చెప్పేసింది. దీంతో అమృత వారసత్వ కేసుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. డీఎన్ఏ పరీక్ష ద్వారా రుజువుచేసుకునేందుకు అవసరమైన జయలలిత రక్త నమూనాలు తమ వద్ద లేవంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి అదే ఏడాది డిసెంబరు 5వ తేదీన కన్నుమూశారు. జయకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్లరూపాయల స్థిర, చరాస్థులు ఉన్నా వారసులుగా ఎవరూ లేరు. జయ అన్నకుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా గుర్తింపుకోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ దశలో బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి తాను జయలలిత, శోభన్‌బాబుల ప్రేమ ఫలమని ప్రకటించుకుంది. జయ వారసురాలిగా తనను ప్రకటించాలని కోరుతూ గత ఏడాది ఆఖరులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మెరీనా బీచ్ సమాధి నుంచి జయ పార్థివదేహాన్ని బయటకు తీసి అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయాలని, తనకు డీఎన్ఏ పరీక్ష చేయాల్సిందిగా కోర్టును కోరింది. ఈ కేసు న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు వచ్చింది. జయలలిత వారసురాలినని చెప్పుకునేందుకు అమృత వద్ద అధికార పూర్వమైన ఆధారాలు లేనందున ఈ కేసును విచారణకు స్వీకరించరాదని తమిళనాడు ప్రభుత్వం వాదన ప్రారంభించింది. ఈ పరిస్థితిలో జయలలిత రక్తనమూనాలు ఉన్నాయా అనే విషయంలో బదులివ్వాల్సిందిగా అపోలో యాజమాన్యాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అమృత పిటిషన్ కొట్టివేయాలని.. జయలలిత ఆస్తులను కాజేసే ఉద్దేశంతో అమృతవేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. అమృత దాఖలు చేసిన కేసు గురువారం విచారణకు రాగా అపోలో ఆస్పత్రి యాజమాన్యం తరఫు న్యాయవాది మైమునాబాషా బదులు పిటిషన్ దాఖలు చేశారు. అపోలో తరఫున మరో పిటిషన్ అపోలో ఆసుపత్రి న్యాయవిభాగం మేనేజర్ మోహన్‌కుమార్ తరఫున మరో పిటిషన్ వేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘2016 సెప్టెంబరు 9వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు 75 రోజులపాటు అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు మెరుగైన చికిత్సను ఆమెకు అందజేశారు. జయలలిత మరణం తరువాత అదే ఏడాది డిసెంబరు 7వ తేదీన ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన రక్తాన్ని అప్పటికప్పుడే వినియోగించేశాం. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి స్వాధీనంలో జయలలితకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, రక్త నమూనాలు లేవు’’ అని కోర్టుకు వారు స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు 4వ తేదీకి వాయిదావేశారు. -
‘జయ బయలాజికల్ శాంపిల్స్ లేవు’
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయలాజికల్ శాంపిల్స్ తమ వద్ద లేవని ఆమె చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన అమృత తాను జయలలిత కుమార్తెను అంటూ ముందుకురావడంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాధన్ కోరిన వివరాలకు బదులిస్తూ ఆస్పత్రి యాజమాన్యం ఈ మేరకు నివేదించింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు కేసు విచారణ సందర్భంగా అమృత వాదనలకు జయ మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపలు అభ్యంతరం తెలిపారు. జయలలిత కుమార్తెను తానేనంటూ అమృత చేస్తున్న వాదనకు ఎలాంటి ఆధారాలూ లేనందున పిటిషనర్ కేవలం సివిల్ కోర్టునే ఆశ్రయించాలని అన్నారు. అమృత పోయెస్ గార్డెన్స్ నివాసంలో జయలలితను కలిసినట్టు లేదా జయలలిత బెంగళూరు పర్యటనల సందర్భంగా అమృతను కలిసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కాగా కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ 4కు వాయిదా వేసింది. -
జయ తుదిశ్వాస వరకు అంతా రహస్యమే!
న్యూఢిల్లీ: చెన్నై నగరంలోని ఆపోలో ఆస్పత్రిలో 74 రోజుల పాటు చికిత్సపొంది చివరకు తుదిశ్వాస విడిచినప్పటికీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆది నుంచి నెలకొన్న అనుమానాలు, ఆపోహలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆదివారం సాయంత్రం వచ్చిన గుండెపోటు నుంచి జయలలిత కోలుకోలేకపోయారంటూ ఆస్పత్రి వర్గాలు చెప్పిన మాటలను నమ్ముతున్న వారు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడో చనిపోతే ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదని సందేహించే వారు ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు, అనుమానాలు అపోహలు కూడా ఏర్పడిన విషయం తెల్సిందే. వీవీఐపీల విషయంలోనే ఆస్పత్రి వర్గాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తాయి? వాస్తవ సమాచారం ప్రజలకు తెలియకుండా ఎందుకు తొక్కి పెడతారు? వాళ్లపైన ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి? ‘వీవీఐపీల చికిత్స విషయంలో మాపై రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. అధికార పార్టీల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి, మీడియా వర్గాల నుంచి, కొన్ని సందర్భాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. మేము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. షేషెంట్ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మేము ఎలాంటి సమాచారాన్ని బయటకు విడుదల చేయకూడదు. పలువురు వైద్యులు పలురకాలుగా వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి కేసుల్లో మేము ఎప్పటికప్పుడు మెడికల్ బులిటెన్లను విడదల చేయడానికి ఓ అధికార ప్రతినిధిని నియమిస్తాం. ఆ ప్రతినిధి కుటంబసభ్యుల అభిప్రాయం మేరకు బులిటెన్ తయారు చేస్తారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] బులిటెన్ మొదట కుటుంబ సభ్యులకు చదివించి వినిపిస్తాం. ఆ తర్వాత వారి గీకారంతోనే బయటకు ప్రకటిస్తాం’ అని శివసేన చీఫ్ బాల్ ఠాక్రేతోపాటు పలువురు రాజకీయ వేత్తలకు వైద్యసేవలు అందించిన, ప్రస్తుతం ఓ సినిమా నటుడికి వైద్య సేవలు అందిస్తున్న ముంబైలోని లీలావతి ఆస్పత్రి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్, లీలావతి ఆస్పత్రి ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పాండేతోపాటు వీవీఐపీలకు చికిత్సలు అందించిన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ముంబై, ఢిల్లీలోని ఆస్పత్రుల డాక్టర్లు తెలిపారు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్ల విషయంలో వారి అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకొని సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తుందని వారన్నారు. ఆ క్షణాన నిజాన్ని తట్టుకునే పరిస్థితి వారికుందా, లేదా? అన్న అంశాన్ని కూడా పరిగణలోని తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా దగ్గరి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని వారు చెప్పారు. జయలలితకు కుటుంబ సభ్యలు ఎవరులేరు కనక ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో తమకు తెలియదని వారన్నారు. ఇదే విషయాన్ని జయలలితకు చికిత్స అందించిన ఆపోలో ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించగా ఎక్కువ వరకు తమిళనాడు ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకోవాల్సి వచ్చిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జయలలిత మరణాన్ని అధికారికంగా అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించేవరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై చెలరేగిన ఊహాగానాల్లో నిజమెంతో, అబద్ధమెంతో పన్నీర్‌సెల్వం ప్రభుత్వం ప్రకటించేవరకు రహస్యమే. -
బతికే అవకాశం ఫిఫ్టీ..ఫిఫ్టీ
-
‘అమ్మ’ గురించి ఆందోళన: నేత మృతి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై టీవీలో వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురైన ఓ అన్నాడీఎంకే నాయకుడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన కడలూరి జిల్లాలో చోటు చేసుకుంది. కడలూరి జిల్లా గాంధీ నగర్ కు చెందిన నీలగండన్ అనే వ్యక్తి అన్నాడీఎంకేలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై టీవీ ఛానళ్లలో వస్తున్న వార్తలను చూసన నీలగండన్ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను 108లో హుటాహుటిన ఆస్పత్రికి తరిలించేందకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందారు. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా జయలలిత చికిత్స పొందుతున్న అపోలో హాస్పటిల్ వద్ద ఆదివారం సాయంత్రం నుంచే భారీ ఎత్తున అభిమానులు, నాయకులు చేరుకున్నారు. అమ్మకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమ్మ కోసం ప్రార్థనలు, పూజల్లో నిమగ్నమయ్యారు. -
అపోలోలో అమ్మ; 74 రోజుల్లో ఏం జరిగిందంటే..
-
బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్టీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని చెన్నైలోని ఆపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీఎంవో అంటే ఎక్స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేక పోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు నరేశ్ ట్రెహాన్ తెలిపారు. ఈ ఈసీఎంవో వ్యవస్థపై రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు కూడా జీవించే అవకాశం ఉంటుంది. ఏ రకంగాను వైద్యానికి రోగి శరీరం స్పందించకపోయిన పరిస్థితుల్లో చివరి అవకాశంగా మాత్రమే ఈ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తారు. శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని గ్రహించే ఈ పరికరం, ఆ రక్తాన్ని తిరిగి గుండే, ఊపిరితిత్తుల ద్వారా శరీరం అంతటికి ప్రవహించేలా చేస్తోంది. ఈ ప్రక్రియలో రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. సాధారణంగా ఈ ఈసీఎంఓను ప్రముఖలకు మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు. -
అపోలోలో అమ్మ; 74 రోజుల్లో ఏం జరిగిందంటే..
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత 74 రోజులుగా ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన మొదట్లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెప్పడంతో తమిళనాడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జి అవుతారని వైద్యులు, అన్నా డీఎంకే నాయకులు చెప్పడంతో ప్రజలు సంతోషించారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు ఇలాంటి ప్రకటనే చేశారు. దీంతో అమ్మ త్వరలో ఇంటికి వస్తారని ప్రజలు భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారిందని తెలియడంతో తమిళనాట విషాదం నెలకొంది. జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి 74 రోజులు అయ్యింది. నాటి నుంచి ఈ రోజు వరకు కీలక పరిణామాలు.. -
తమిళనాడు కేబినెట్ అత్యవసర భేటీ
-
జయలలిత ఆరోగ్యం విషమం
-
చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్
-
'అమ్మ'కు సీరియస్
మళ్లీ ఐసీయూలోకి జయలలిత.. గుండెపోటు వచ్చినట్లు అపోలో ప్రకటన 8 మంది ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స లండన్ వైద్యుడితోనూ సంప్రదింపులు గవర్నర్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్ హుటాహుటిన చెన్నైకి విద్యాసాగర్‌రావు అపోలో వైద్య బృందంతో చర్చలు ఆసుపత్రిలోనే కేబినెట్ అత్యవసర భేటీ భారీగా చేరుకున్న అన్నాడీఎంకే శ్రేణులు ఆసుపత్రి పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత తమిళనాడు వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం పలు ఆలయాల్లో ప్రార్థనలు , పూజలు నేడు విద్యాసంస్థలన్నిటికీ సెలవు చెన్నై: రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విషమించింది. గుండెపోటు రావడంతో జయలలితను జనరల్ వార్డు నుంచి ఐసీయూలోకి మార్చినట్లు అపోలో ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రికి ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆమెకు గుండె సంబంధ నిపుణులు, అత్యవసర వైద్య చికిత్సా నిపుణులు చికిత్సనందిస్తూ పర్యవేక్షిస్తున్నారు’’అని ఆదివారం రాత్రి అపోలో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ నిపుణుల బృందం ధ్రువీకరించినట్లు అన్నాడీఎంకే ప్రకటించిన కొద్ది గంటలకే జయ గుండెపోటుకు గురయ్యారు. జయకు చికిత్స జరుగుతున్న అపోలో అసుపత్రి పరిసరాలలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాపితంగా ఆర్మ్డ్, రిజర్వ్ పోలీసులు బలగాలను మోహరించారు. ఆసుపత్రి చుట్టుపక్కల హోటళ్ల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. జయకు గుండెపోటు వార్త గురించి తెలియగానే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయ అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నేడు ఎయిమ్స్ బృందం రాక ఎనిమిది మంది ప్రత్యేక వైద్య నిపుణులతో కూడిన బృందం జయలలితకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి. ఈ బృందం లండన్‌లోని డాక్టర్ రిచర్డ్ బేలీతోనూ సంప్రదింపులు జరుపుతోంది. జయలలితకు చికిత్స అందించడం కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం వస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. జయలలిత ఆరోగ్యం గురించి అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాపరెడ్డితో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాశ్ నద్దా ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. కాగా జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడు మంత్రివర్గం అపోలో ఆసుపత్రిలోనే భేటీ అయింది. హుటాహుటిన వచ్చిన గవర్నర్ నేవీడే వేడుకల కోసం ముంబైలో ఉన్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన బయలుదేరి చెన్నై వచ్చారు. ఆయన నేరుగా అపోలో ఆసుపత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడారు. గవర్నర్ వెంట అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి కూడా ఉన్నారు. ఆసుపత్రిలో 10 నిమిషాల సేపు ఉన్న గవర్నర్ ఆ తర్వాత బయటకు వచ్చి రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఆయన ఏమన్నా మాట్లాడతారని బయట విలేకరులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అరుుతే రాజ్‌భవన్‌కు వెళ్లిన తర్వాత గవర్నర్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రముఖుల ట్వీట్లు జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి సహా అనేకమంది ప్రముఖులు ట్వీట్లు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు తదితరులు కూడా ట్వీట్లు చేసినవారిలో ఉన్నారు. గవర్నర్‌కు రాజ్‌నాథ్ ఫోన్ అంతకుముందు జయలలితకు గుండెపోటు వార్తల గురించి తెలిసిన వెంటనే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌చేశారు. జయ ఆరోగ్యం విషయమై వాకబుచేశారు. విద్యాసాగర్‌రావు తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ముంబై నుంచి తాను చెన్నై బయలుదేరి వెళుతున్నట్లు విద్యాసాగరరావు రాజ్‌నాథ్‌కు వివరించారు. రాజ్‌నాథ్‌తో 10 నిమిషాల సేపు ఫోన్లో మాట్లాడిన విద్యాసాగరరావు.. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వివరించారు. ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారని తెలిపారు. జయలలిత ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడం కోసం చెన్నై బయల్దేరి వెళుతున్నట్లు విద్యాసాగరరావు హోం మంత్రికి వివరించారని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర బలగాలు సిద్ధం.. తమిళనాడులో పరిస్థితిని మదింపు చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖఅధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతానికి తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి సాధారణంగా ఉందని ఢిల్లీలోని కేంద్ర అధికారవర్గాలంటున్నాయి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అవసరమైన పక్షంలో సహాయం చేయడానికి తగినన్ని కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే రెండు కేంద్ర పారామిలిటరీ బలగాల అధిపతులు సీఆర్పీఎఫ్ డీజీ కె. దుర్గాప్రసాద్, సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్‌లను తమిళనాడుకు పంపిస్తారని, వారు భద్రతా బలగాలను పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి ఆసుపత్రిలోనే.. డీహైడ్రేషన్, జ్వరంతో సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరారు. ఇతర సమస్యలతో పాటు శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్కు చికిత్స అందిస్తున్నామని అపోలో హాస్పిటల్ వర్గాలు ఆమె ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్సలో పేర్కొన్నాయి. శ్వాసకోశ నాళానికి అదనంగా ఒక కవాటాన్ని చేర్చామని, జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని ఆపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. పూర్తి దేహానికి ఫిజియోథెరపీ జరుగుతోందని, అనేక వారాలపాటు మంచానికే పరిమితమైన జయలలిత ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకున్నందున ఎప్పుడు ఇంటికి వెళ్లాలనేది ఆమె ఇష్టమని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. అమ్మ కోలుకున్నారని ఆనందించిన కాసేపటికే.. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఆదివారం నాడు చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఎరుుమ్స్కి చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం జయలలిత పూర్తిగా కోలుకున్నారని ధృవీకరించినట్లు చెప్పారు. ఎరుుమ్స్ వైద్యులు శనివారం ఆసుపత్రికి వచ్చి జయలలితను పరీక్షించి ‘అమ్మ’కోలుకున్నారనే శుభవార్తను తమకు చెప్పారని పొన్నియన్ వివరించారు. జయలలిత ఎక్సర్సైజులు చేస్తున్నారని, వైద్యులు ఆమెచేత ఫిజియోథెరపీ చేరుుస్తున్నారని, తనంతట తాను ఆహారం తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో నాయకులకు, అధికారులకు సూచనలిస్తున్నారని తెలిపారు. ఆందోళనలో తమిళనాడు జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అమ్మకు ఏమరుు్యందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో అన్నాడిఎంకే శ్రేణులు అపోలో ఆసుపత్రి వైపు తరలి వస్తుండటంతో ఆ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. అన్నాడిఎంకే కార్యకర్తలంతా చెన్నై రోడ్ల మీదకు చేరడంతో రాత్రి పట్టపగలుగా మారింది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమ్మ కోసం ప్రార్థనలు, పూజల్లో నిమగ్నమయ్యారు. ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆదుర్దాతో వాహన చోదకులు పెట్రోల్ బాంక్‌ల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల సూపర్ మార్కెట్లోనూ జనం క్రిక్కిరిశారు. సోమవారం స్కూళ్లు, విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. -
చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండెపోటు వార్త విన్నప్పటి నుంచీ అర్ధారత్రి రెండు గంటలవరకూ 'అమ్మ' జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూకు షిఫ్ట్ చేసి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని, అమ్మ త్వరలో ఇంటికి వెళ్లిపోతారని ఇటీవల కథనాలు రాగా.. ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గవర్నర్ మౌనం.. అమ్మ అభిమానుల్లో భయం భయం! తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబై నుంచి అపోలో ఆస్పత్రికి వచ్చి జయలలిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు ఆస్పత్రిలో ఉన్న గవర్నర్.. మీడియాతో జయ ఆరోగ్యంపై మాట్లాడేందుకు నిరాకరించారు. జయ పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఆమె ఆరోగ్యంపై స్పందించకుండానే రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. రాజ్‌భవన్ నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని జయలలిత అభిమానుల్లో కలవరం మొదలైంది. అర్ధరాత్రి రెండు గంటలు దాటినా ఆస్పత్రి వద్దే ఉండి 'పురచ్చితలైవి అమ్మ..' అంటూ గట్టిగా అరుస్తూ నినాదాలు చేస్తున్నారు. జయలలిత ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితిపై కచ్చితమైన ప్రకటన చేయాలంటూ అమ్మ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు అమ్మ అమ్మ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందోనని భావించిన కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను రప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను ఆస్పత్రి వద్ద మోహరించింది. ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ లో ఉన్న వారిని అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. టోల్‌ప్లాజాలు, హైవేలపై పోలీసులు బందోబస్తు చేపట్టారు. మండల స్థాయి నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. గత సెప్టెంబర్ 22నుంచి అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
జయలలిత ఆరోగ్యం విషమం
చెన్నై: గత రెండు నెలలుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం విషమంగా ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్నారని, రేపో మాపో సీఎం జయలలిత ఇంటికి వెళ్లే అవకాశం ఉందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఆమె కోరుకున్నప్పుడు ఇంటికి వెళ్లడమే తరువాయి అని అపోలో వైద్యులు ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్పెషల్ వార్డు నుంచి జయలలితను ఐసీయూకు షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ ఎలాంటి ప్రకటన చేయకుండానే రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. అపోలో డాక్టర్ల బృందం లండన్ వైద్యుడు రిచర్డ్ ను సంప్రదించి జయకు ఎలాంటి చికిత్స అందజేయాలో తెలుసుకున్నారు. జయలలిత అనారోగ్యం గురించి తెలుసుకున్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయ అభిమానులు అర్ధరాత్రి ఒంటిగంట కావస్తున్నా పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రికి తరలి వస్తుండంతో వారికి అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. లండన్ వైద్యులతో అపోలో డాక్టర్ల సంప్రదింపులు ప్రస్తుతం జయలలితకు హార్ట్ అసిస్ట్ డివైస్ ద్వారా ప్రత్యేక చికిత్స అందజేస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జయలలిత చికిత్స పొందుతున్నారు. గతంలో చెన్నైకి వచ్చి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చికిత్స అందజేసిన లండన్ వైద్యుల బృందం అపోలో వైద్యులతో సంప్రదింపులు జరుపుతోంది. అపోలో కార్డియాలజిస్ట్‌లు, పల్మనాలజిస్ట్‌లతో లండన్ డాక్టర్ రిచర్డ్ సంప్రదింపులు జరిపి, జయకు ఏ రకమైన చికిత్స అందజేయాలో తెలియజేసినట్లు సమాచారం. జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. అపోలో చైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేసి... జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. విద్యాసాగర్ రావు ముంబై నుంచి హుటాహుటిన బయలుదేరి చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం చెన్నై వెళ్లి జయలలితను పరామర్శించనున్నారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై చేరుకుని అపోలో వద్ద నెలకొన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యాసంస్థలకు సోమవారం సెలవు సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో మద్రాస్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలు, పాఠశాలలకు సోమవారం సెలవుదినంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఎడ్యూకేషన్ బోర్డ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఆస్పత్రిలోనే రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుంచి మళ్లీ కోలుకుంటారని రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అపోలో ఆస్పత్రికి తరలివస్తున్న అభిమానులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున జయ అభిమానులు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అస్పత్రికి తరలి వస్తుండటంతో ఆస్పతి వద్ద కేంద్ర, పారా మిలిటరీ బలగాలు ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. అపోలో ఆస్పత్రి వద్ద అవాంచనీయ ఘటనలు తలెత్తుతాయని భావించిన ఉన్నతాధికారులు అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్, రెస్టారెంట్లను ఖాళీ చేయిస్తున్నారు. -
తమిళనాడు కేబినెట్ అత్యవసర భేటీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూ విభాగంలోకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అపోలో చైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేశారు. జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఆస్పత్రిలోనే రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అమ్మ ఆరోగ్య పరిస్థితి, తదనంతర పరిస్థితులపై పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుంచి మళ్లీ కోలుకుంటారని రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పతి వద్ద పారా మిలిటరీ బలగాలు ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. అపోలో ఆస్పత్రి వద్ద అవాంచనీయ ఘటనలు తలెత్తుతాయని భావించిన ఉన్నతాధికారులు అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. -
జయలలిత ఆరోగ్యంపై రాజ్‌నాథ్ ఆరా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో చెన్నై అపోలో వైద్యులు ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూ విభాగంలోకి తరలించి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు జయలలిత గుండెపోటు సమాచారం తెలియగానే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసిన రాజ్‌నాథ్.. జయ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జయలలిత ఆరోగ్యం క్షీణించినట్లు అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జయ గుండెపోటలు విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే కీలక నేతలు, కార్యకర్తలు వేలాదిగా చెన్నై అపోలో అస్పత్రికి తరలివస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో గత సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వదంతులు ప్రచారం అయినా, పూర్తిగా కోలుకున్న తర్వాతే జయ ఆస్పత్రి నుంచి ఇంటికి వెళతారని అపోలో వైద్యులు అప్పట్లో తెలిపారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం జయలలితకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఐసీయూ వార్డులోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అమ్మ కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, జయ అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేస్తున్నారు. -
జయ ఫిజియోథెరపీకి సింగపూర్ రోబో?
-
ఆరోగ్యంగా సీఎం జయలలిత
-
ఆరోగ్యంగా సీఎం జయలలిత
డిశ్చార్జ్ ఆమె అభీష్టం: అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: కొన్నిరోజుల క్రితమే పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి జయలలిత సహజస్థితికి చేరుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆమె కోరుకుంటే ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చన్నారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22 అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు సుదీర్ఘ చికిత్స అందించారు. అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ఆమె మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ వల్ల సీఎం సహజస్థితికి చేరుకున్నారన్నారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. -
జయలలిత మాట్లాడారు!
-
జయలలిత మాట్లాడారు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కోలుకుంటున్నారని, ఆమె కీలక అవయవాలన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాలర్ మైకు ద్వారా ఆమె కొద్ది నిమిషాలు మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రతిరోజూ కొంతసేపు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. అయితే 90 శాతం సమయం మాత్రం ఆమె తనంతట తానే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ఆమెకు స్టాటిక్ మరియు యాక్టివ్ ఫిజియోథెరపీ అందిస్తున్నామని.. ఇక తర్వాత ఆమె లేచి నిలబడి, నడవడమే తరువాయి అని వివరించారు. జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఎప్పుడు డిశ్చార్జి అయి వెళ్లాలన్నది ఆమె ఇష్టమేనని ఆయన అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ పాలనాపగ్గాలు చేపట్టాలంటూ అన్నాడీఎంకే అభిమానులు, కార్యకర్తలు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు, అన్నదానాలు చేశారు. -
జయలలితదే తుది నిర్ణయం
-
జయలలితదే తుది నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ సోకకూడదని జయలలితను ఇంకా ఐసీయూలోనే ఉంచామని చెప్పారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది జయలలితే నిర్ణయించుకుంటారని ప్రతాప్ సి.రెడ్డి పేర్కొన్నారు. అయితే డిశ్చార్జ్ తేదీ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తమ అధినేత్రి పూర్తి స్థాయిలో కోలుకోవడంతో అన్నాడీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత తనంతట తాను శ్వాస తీసుకుంటున్నారని... ఆమెకు ఇది పునర్జన్మ అని చెబుతున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. -
రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి?
ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. కీలకమైన అంశాలన్నీ అదుపులోనే ఉన్నాయని.. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో 15 రోజుల్లో ఇంటికి పంపే అవకాశం ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్‌లోకి మార్చే విషయంపై మీడియా ప్రశ్నించగా.. అక్కడకు, ఇక్కడకు తేడా అత్యవసర పరికరాలు మాత్రమేనని ఆయన వివరించారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. పూర్తిస్థాయిలో కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు. మరికొన్ని రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలోనే ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించిన వెంటనే ఆమె తనంతట తానుగా కూర్చోలేకపోతున్నారని, ప్రస్తుతం ఘన-ద్రవం లాంటి పదార్థాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు తప్ప వేరే ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) లోపలకు అనుమతించడం లేదు. అక్కడి నుంచే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తన సలహాదారులతో ప్రత్యేకమైన ఆడియో వ్యవస్థ ద్వారా మాట్లాడుతున్నారని పొన్నియన్ చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
నాలుగు వారాల్లో జయలలిత డిశ్చార్జ్!
-
నాలుగు వారాల్లో జయలలిత డిశ్చార్జ్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో మూడు లేదా నాలుగు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యం మెగురుపడుతోందని క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)నుంచి రెండు,మూడురోజుల్లో రూమ్‌లోకి మార్చనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి బాగా కోలుకుంటున్నారని, తన చుట్టు ఏం జరుగుతుందో ఆమె గుర్తిస్తున్నారని ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తనకు ఏం కావాలో జయలలిత అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలలిత సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సీసీయూ నుంచి బయటకు అమ్మ!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి గదిలోకి మారుస్తారట. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వివరించారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలితను (68) సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇప్పటికీ కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని, అందువల్ల మరికొంత కాలం పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల కన్సల్టెంటులు, డయాబెటాలజిస్టు, ఎండోక్రినాలజిస్టు తదితర నిపుణులు ప్రస్తుతం జయలలితకు చికిత్స అందిస్తున్నారు. చిట్టచివరి సారిగా అక్టోబర్ 21వ తేదీన ఆమె హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. అప్పుడు ఆమె మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. అమ్మను ఎప్పుడు ఆస్పత్రి నుంచి పంపాలన్నది వైద్యుల నిర్ణయమేనని పొన్నియన్ చెప్పారు. ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, మిగిలిన సమస్యలను ఆమె గదిలో ఉండగా లేదా ఇంట్లో ఉండగా నయం చేయొచ్చని ఆయన అన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత కారణంగానే ఆమె దాదాపు 18 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారని పొన్నియన్ తెలిపారు. తగిన చికిత్స తర్వాత జ్వరం తగ్గిందని, ఆ తర్వాత బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు అంతా కలిసి అమ్మను సాధారణ స్థితికి దగ్గరగా తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. -
అమ్మ కూర్చుంటున్నారు కానీ...!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చాలావరకు స్పృహలోనే ఉంటున్నారని, ఆస్పత్రిలో బెడ్ మీద లేచి కూర్చుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శ్వాసకోశ సమస్యల కారణంగా ఆమెకు కృత్రిమ శ్వాస మాత్రం అందించాల్సి వస్తోందన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. గత నెల రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, దానికి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆమె మరన్నిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే ఊపిరి అందించే ట్యూబును ఉంచాలా తీసేయాలా అన్నది నిర్ణయించగలమని అన్నారు. జయలలితకు పూర్తిగా నయమైపోయిందని, ఆమె త్వరలోనే ఇంటికి తిరిగివస్తారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం అన్నారు. వైద్యుల సలహా మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని, అది తప్ప ఆమెకు పూర్తిగా నయమైపోయిందని చెప్పారు. ఆరోగ్యం విషయంలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడని, త్వరలోనే ఆమె తిరిగి ఇంటికి వస్తారని ఆమె తెలిపారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నందువల్ల లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్యుల బృందం కూడా ఆమె చికిత్సను పర్యవేక్షించింది. దాదాపు నెల రోజుల నుంచి అమ్మ ఆస్పత్రిలోనే ఉండిపోవడంతో ఆమె వద్ద ఉన్న కీలక శాఖలను ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వంకు అప్పగించారు. గతవారం టేబుల్ మీద జయలలిత ఫొటో ఉంచి, ఆమె కుర్చీని ఖాళీగానే ఉంచి ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించారు. -
అమ్మ కోసం.. 25 రోజులుగా అక్కడే!
వాళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు. పనిచేసుకుంటే తప్ప పొట్ట నిండని పరిస్థితి వాళ్లది. చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వాళ్లంతా.. గత 25 రోజులుగా ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. తమవాళ్లు ఎవరికో ఆరోగ్యం బాగోలేదని కాదు.. తామంతా అమ్మగా భావించే జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని! అలాల్ బాయి (60) వెల్లూరు జిల్లా వనయింబాడి ప్రాంతంలో టైలర్ పని చేసుకుంటూ ఉంటారు. ఆమె సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటివరకు చెన్నై అపోలో ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె అక్కడే ఉంటారు. రాత్రిపూట మాత్రం ఎమ్మెల్యే హాస్టల్ కారిడార్లలో నిద్రపోతున్నారు. ప్రస్తుతానికి తాను వ్యాపారం మానేశానని, అమ్మ మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నానని ఆమె చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత 'జ్వరం, డీహైడ్రేషన్'తో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఒక్క శశికళ తప్ప.. మరెవ్వరికీ ఆమెను చూడటానికి కూడా అనుమతి లభించడం లేదు. మడిపాక్కం ప్రాంతానికి చెందిన సురేష్ బాబు (41) ఒక ప్రైవేటు కంపెనీ మార్కెటింగ్‌లో ఉన్నాడు. ఫార్మల్ దుస్తులలో తిరుగుతుండే అతను కూడా సెప్టెంబర్ 23 నుంచి అపోలో ఆస్పత్రివద్దే ఉంటున్నాడు. చాలాకాలంగా అన్నాడీఎంకే పార్టీ సభ్యుడైన సురేష్.. తనకు అమ్మ ఆరోగ్యం తప్ప ఏమీ అక్కర్లేదని చెప్పాడు. పలు ఆలయాల్లో రోజూ ప్రార్థనలు చేస్తున్నానని, పోయెస్ గార్డెన్‌కు కూడా రోజూ వెళ్తున్నానని అన్నాడు. మార్కెటింగ్‌లో ఉన్నందున రోజూ ఆఫీసుకు వెళ్లక్కర్లేదని, అందువల్ల ఫోన్లో క్లయింట్లతో మాట్లాడుకుని మేనేజ్ చేసుకుంటున్నానని తెలిపాడు. ఇంకా ఇలా చాలామంది అపోలో ఆస్పత్రి బయట వేచి చూస్తున్నారు. వేలాది మంది అక్కడే గుమిగూడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్ల బంధువులకు మాత్రం కొంత ఇబ్బంది తప్పడం లేదు. -
అమ్మ ఆరోగ్యం.. ఇంకా గోప్యమే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పడమే తప్ప ఇంతవరకు ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటో, ఆమెకు ఎలాంటి చికిత్స చేస్తున్నారో ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. అంతేకాదు, గత వారం రోజుల నుంచి అసలు అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్లు కూడా ఇవ్వడం లేదు. అమ్మను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర్నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మాజీ గవర్నర్లు, కీలక నేతలు.. అనేకమంది రోజూ వస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా వస్తారని చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న ఐసీయూ సమీపానికి కూడా వెళ్లనివ్వడం లేదు. ఎంత పెద్ద నాయకులైనా కేవలం వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సిందే. మరి ప్రధానమంత్రినైనా పంపుతారో లేదో చూడాలి. అపోలో ఆస్పత్రి వద్ద వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు గత 24 రోజులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఆమెకోసం ప్రత్యేకప్రార్థనలు, అన్నదానాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జయలలిత వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ చెప్పడం లేదు. లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బాలే, ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు చెన్నై అపోలో ఆస్పత్రి వైద్య బృందం ఈ 24 రోజుల నుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి కూడా వైద్యనిపుణులను రప్పిస్తున్నారు. అయితే.. కేవలం జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహం లాంటి సామాన్య సమస్యలతోనే ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇన్నాళ్లుగా ఎందుకు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది, ఆమె మళ్లీ తిరిగి అధికార పగ్గాలు ఎప్పుడు చేపడతారు అనే ప్రశ్నలు సామాన్య పౌరుల దగ్గర నుంచి పార్టీ అభిమానులు, నాయకులు, చివరకు ప్రస్తుతం ముఖ్యమంత్రి శాఖలన్నింటినీ చేపట్టిన ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం వరకు అందరికీ వస్తున్నాయి. వాటికి సమాధానం ఇచ్చేవాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం జయలలిత ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల అయితే.. జయలలిత కళ్లు తెరిచారని, వెంటిలేటర్ కూడా తీసేశారని విపరీతంగా ప్రచారం జరిగింది. జయలలిత చికిత్సకు వేగంగా స్పందిస్తున్నారని, ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు. వీళ్లందరూ చెప్పే మాటల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో.. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదదో మాత్రం సామాన్య ప్రజలకు ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకు ఇంత గోప్యత పాటించాల్సి వస్తోందో అర్థం కావడం లేదు. అపోలో వైద్యులు మధ్యమధ్యలో ఒకోసారి అమ్మ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్లు జారీ చేస్తున్నారు. సాధారణంగా హెల్త్ బులెటిన్ అంటే, అందులో షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన ఇతర పారామీటర్లు ఎలా ఉన్నాయన్న వివరాలు ఉంటాయి. కానీ జయలలిత హెల్త్ బులెటిన్‌లో మాత్రం ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని మాత్రమే చెబుతున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన బులెటిన్‌లో... ఊపిరితిత్తుల్లో శ్లేష్మపొరను తొలగించే మందులు వాడుతూ మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని, ఫిజియోథెరపీ ద్వారా ఊపిరి తీసుకునేందుకు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటెన్సివిస్ట్ల ఆధ్వర్యంలో సీఎం ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇంకా చాన్నాళ్లే జయ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని.. పునరుద్ఘాటించారు. అలాగే వైద్యచికిత్సలో అన్నిరకాల సమగ్ర చర్యల్లో భాగంగా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. జయలలిత ఆరోగ్యం గురించిన వివరాలను వెల్లడించాలని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి చేసిన డిమాండును అన్నాడీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. తాము ప్రజలకు జవాబుదారీ తప్ప డీఎంకేకు కాదని చెప్పాయి. దీంతో అసలు ఏం జరుగుతోందోనన్న ఆందోళన ప్రజల్లో కలిగింది. కానీ వీటిన్నింటికీ సమాధానాలు మాత్రం రావడం లేదు. -
'నేరుగా పరామర్శించలేకపోయా'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రి సందర్శించారు. జయలలిత ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయలలితను ప్రత్యక్షంగా పరామర్శించలేకపోయానని, ఆమెను చూసేందుకు ఎవరినీ లోపలకు అనుమతించడం లేదని రోశయ్య చెప్పారు. జయలలితకు అందిస్తున్న చికిత్స వివరాలు తనకు వైద్యులు చెప్పారని తెలిపారు. 68 ఏళ్ల జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆమెకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. కాగా, ఆమె కోలుకోవాలని తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. -
జయలలిత పేపర్లు చదువుతున్నారట!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన వద్ద ఉన్న శాఖలన్నింటినీ ఆర్థికమంత్రి పన్నీరు సెల్వంకు ఇవ్వాలని చెప్పారని.. అందుకు ఆమె అనుమతించారని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు పలు వర్గాల నుంచి అనుమానాలు తలెత్తాయి. అయితే.. పార్టీ వర్గాలు వాళ్ల అనుమానాలను పటాపంచలు చేసేలా సరికొత్త విషయం వెల్లడించాయి. జయలలిత చాలా త్వరగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని తమకు వైద్యులు వెల్లడించినట్లు అన్నాడీఎంకే ప్రతినిధులు చెబుతున్నారు. పన్నీరుసెల్వంకు శాఖలు అప్పగించడంపై జయలలితకు సందేశం పంపగా, ఆమె 'సరే' అన్నారని.. ఆమె స్పృహలోనే ఉన్నారని పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి చెప్పారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ఎవరుపడితే వాళ్లను లోనికి అనుమతించడం లేదని.. కేవలం వైద్యులు మాత్రమే లోనికి వెళ్లి ఆమెకు సందేశాలు వినిపిస్తున్నారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రికి తెలియకుండా అన్నాడీఎంకేలో ఏమీ జరగదని అన్నారు. ఆర్థికమంత్రి పన్నీరుసెల్వంకు తన శాఖలు ఇవ్వడానికి జయలలిత ఎలా అనుమతి ఇచ్చారో వివరించాలంటూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో.. దానికి సమాధానంగా పార్టీ ప్రతినిధులు ఈ విషయాలన్నీ వెల్లడించారు. జయలలిత ఆ ఫైలులో సంతకం చేశారా లేదా అనే అనుమానం అన్నివర్గాల ప్రజలకు ఉందని డీఎంకే అధినేత, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కరుణానిధి అన్నారు. పీఎంకే నాయకుడు ఎస్.రామదాస్ కూడా ఈ అంశంపై స్పందించారు. గవర్నర్ వివరించేవరకు అది అనుమానమేనని, బయటి నుంచి ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్న తరుణంలో జయలలిత సంతకం చేయడం లేదా తలాడించడం కూడా చేసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. అయితే.. జయలలిత పేపర్లు చదువుతున్నారన్న విషయాన్ని డాక్టర్లే చెప్పారని.. వాళ్లు అబద్ధాలు ఎందుకు చెబుతారని సీఆర్ సరస్వతి చెప్పారు. -
అమ్మకు సందర్శకుల తాకిడి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సందర్శకుల తాకిడి వెల్లువెత్తుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తదితరులు సోమవారం నాడు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అయితే జయలలిత ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నందున ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని వైద్యులు సూచించడంతో.. వైద్యులతోనే మాట్లాడి బయటకు వచ్చేశారు. జయలలిత కోలుకుంటారని, ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని బయట మీడియాతో చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు. మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పాలన వ్యవహారాలను చూసుకుంటున్నారని, అమ్మ మళ్లీ వస్తారని, పాలన పూర్తిగా గాడిలో పడుతుందని చెబుతున్నారు. -
జయలలితకు రాహుల్ గాంధీ పరామర్శ
-
జయలలితకు రాహుల్ గాంధీ పరామర్శ
గత 15 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. ఎవరికీ ముందుగా సమాచారం ఇవ్వకుండా ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చిన ఆయన.. ఉదయం 11.45 గంటల సమయంలో నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి అపోలో ఆస్పత్రికి వచ్చారు. పావుగంట పాటు ఆయన ఆస్పత్రి లోపలే ఉన్నారు. అయితే, ఎవరినీ నేరుగా జయలలిత వద్దకు వెళ్లనివ్వకపోతుండటంతో.. అసలు ఆయన ఆమెను చూశారా, లేదా వైద్యులతోనే మాట్లాడి వచ్చేశారా అన్న విషయం మాత్రం తెలియరావడం లేదు. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి జయలలిత.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఆమె ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా పలు రకాల ఆందోళనలు, అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అపోలో వైద్యులతో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందం, లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలే తదితరులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
అమ్మ కోసం.. ఎయిమ్స్ వైద్య బృందం!
-
అమ్మ కోసం.. ఎయిమ్స్ వైద్య బృందం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించేందుకు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఒకటి చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుంది. పల్మనాలజిస్టు డాక్టర్ జీసీ ఖిల్నాని, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్ నాయక్, అనస్థటిస్టు డాక్టర్ అంజన్ ట్రిఖాలతో కూడిన బృందం గురువారం ఉదయమే చెన్నై చేరుకుంది. వైద్యులు జయలలితను పరీక్షించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండటంతో మద్రాస్ హైకోర్టుకు అపోలో వైద్య బృందం, తమిళనాడు ప్రభుత్వం కూడా వివరించనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇప్పుడు కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోని ఉండాల్సి ఉంటుందని అన్నారు. లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ స్పెషలిస్టు అయిన డాక్టర్ రిచర్డ్ బీలే కూడా ఇప్పటికే అమ్మ చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. -
'ఇళయరాజా కులాసాగా ఉన్నారు'
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు, నటుడు వెంకట్ ప్రభు తెలిపారు. ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. 'ఇళయరాజా ఆస్పత్రిలో చేరారని తెలియగానే అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు. ఇళయరాజా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆయనిప్పుడు కులాసాగా ఉన్నారు. జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఈరోజే విడుదలవుతారు' అని వెంకట్ ప్రభు సోమవారం ట్వీట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన ఈనెల 15న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ఇళయరాజా కుటుంబ సభ్యులు తెలిపారు. 72 ఏళ్ల ఇళయరాజా 5 వేలకు పైగా పాటలు కంపోజ్ చేశారు. For all isaignani fans and well wishers out there!! Raja pa is absolutely fine!! Just a general check up & few tests! He is back home 2day -
చెన్నై అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత
కొరుక్కుపేట: చెన్నై అపోలో ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. బ్రెయిన్‌డెడ్ అయిన ఐదుగురు జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఒకో రోజు ఐదుగురి నుంచి 23 అవయవాలను సేకరించడం ద్వారా అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మద్రాసు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అవడంతో వారి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారని చెప్పారు. ఒక్క రోజులో ఐదుగురు నుంచి 23 అవయవాలను స్వాధీనం చేసుకున్నామని... దీని వలన 23 మందికి పునర్జన్మ ఇచ్చేందుకు అవకాశం కలిగిందని ఇది ఎంతో అరుదైన ఘనత అన్నారు. 23 అవయవాల్లో ఐదు లివర్లు, ఒక గుండె, నాలుగు కిడ్నీలు అపోలో ఆసుపత్రి తీసుకోగా, మిగిలిన ఒక గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి, నాలుగు కిడ్నీలు కోయంబత్తూరు కేజీహెచ్‌కు, ఒక కిడ్నీ కామాక్షి ఆసుపత్రికి, ఒక కిడ్నీ గ్లోబల్ ఆస్పత్రికి, ఆరు నేత్రాలను శంకర్ నేత్రాలయాకు అందించినట్లు తెలిపారు. -
'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన సోదరుడి కుమారుడు యుగంధర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే వెంకటరమణ ప్రాణాలు తీసిందని అన్నారు. వెంకటరమణ శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని, దీనికి వైద్యులే బాధ్యత వహించాలని యుగంధర్ డిమాండ్ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరమణ సోమవారం ఉదయం కనుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఆదివారం అపోలో వైద్యులు బైపాస్ సర్జరీ చేసినా.. ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. -
టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
-
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
చెన్నై: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ సోమవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో... మృతి చెందారు. వెంకట రమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో జన్మించిన రమణ...ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. అంచలంచెలుగా ఎదిగిన రమణ...2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకట రమణకు మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది. కాగా వెంకట రమణ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు వెంకట రమణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నారు.