
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
చెన్నై: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ సోమవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో... మృతి చెందారు.
వెంకట రమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో జన్మించిన రమణ...ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. అంచలంచెలుగా ఎదిగిన రమణ...2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది.
తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకట రమణకు మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది.
కాగా వెంకట రమణ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు వెంకట రమణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నారు.