చెన్నై అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత
కొరుక్కుపేట: చెన్నై అపోలో ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. బ్రెయిన్‌డెడ్ అయిన ఐదుగురు జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఒకో రోజు ఐదుగురి నుంచి 23 అవయవాలను సేకరించడం ద్వారా అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు.
మద్రాసు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అవడంతో వారి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారని చెప్పారు. ఒక్క రోజులో ఐదుగురు నుంచి 23 అవయవాలను స్వాధీనం చేసుకున్నామని... దీని వలన 23 మందికి పునర్‌జన్మ ఇచ్చేందుకు అవకాశం కలిగిందని ఇది ఎంతో అరుదైన ఘనత అన్నారు. 23 అవయవాల్లో ఐదు లివర్‌లు, ఒక గుండె, నాలుగు కిడ్నీలు అపోలో ఆసుపత్రి తీసుకోగా, మిగిలిన ఒక గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి, నాలుగు కిడ్నీలు కోయంబత్తూరు కేజీహెచ్‌కు, ఒక కిడ్నీ కామాక్షి ఆసుపత్రికి, ఒక కిడ్నీ గ్లోబల్ ఆస్పత్రికి, ఆరు నేత్రాలను శంకర్ నేత్రాలయాకు అందించినట్లు తెలిపారు.