Braindead
-
నేను మరణించలేదు..! అందరినీ చూస్తున్నా..!!
సంగారెడ్డి: బ్రెయిన్‌డెడ్ అయి ఓ యువకుడు మృతిచెందగా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని నేత్రాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లికి చెందిన బబ్బూరి రాజులుగౌడ్(36) ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు రోజుల కిత్రం బాత్రూంలో స్నానం చేస్తూ కళ్లు తిరిగి కిందపడిపోయాడు. అతన్ని వెంటనే గజ్వేల్‌కు, ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయి రాజులుగౌడ్ మృతి చెందాడు. ఆ బాధను దిగమింగుతూ మృతుడి నేత్రాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు నేత్రాలు తీసుకెళ్లారు. మృతుడు స్వయంగా మజీద్‌పల్లి గ్రామసర్పంచ్ లత భర్త శివరాములుగౌడ్‌కు సోదరుడు. కాగా, సోమవారం టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
మరణిస్తూ నలుగురికి కొత్త జీవితం
కొరుక్కుపేట(చెన్నై): తాను చనిపోతూ మరో నలుగురుకి కొత్త జీవితాన్ని అందించాడు బ్రెయిన్‌డెడ్‌కు గురైన 33ఏళ్ల యువకుడు. స్థానిక ట్రిప్లికేన్‌లోని దుర్గా లాయిడ్స్ రోడ్డులో నివాసం ఉంటున్న ఆర్.జయప్రకాశ్(33) ప్రైవేట్ ఫ్యాబ్రికేటింగ్ సంస్థలో అసెంబ్లింగ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పనిచేస్తున్న స్థలంలోనే తలకు తీవ్రగాయం కావడంతో చికిత్సకోసం ఈనెల 13న శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈనెల 15న జయప్రకాశ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్ మహ్మద్ రేలా బృందం అతని అవయవాలను కలకత్తాకు చెందిన 54ఏళ్ల వ్యాపార వేత్తకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగా, డాక్టర్ ఎస్.వెంకటరమణన్ బృందం నైవేలికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మరో కిడ్నీ, గుండెను మరో రెండు ఆసుపత్రులకు తరలించారు. కార్నియాను భవిష్యత్తు ఉపయోగం కోసం ఎస్ఆర్ఎంసీలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. -
ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్యం
-
విషమంగానే సంజన ఆరోగ్యం
ప్రమాద వార్త తెలిసి ఆమె తాతకు గుండె నొప్పి హైదరాబాద్: ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లి శ్రీదేవిని కూడా మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. మనవరాలిని, కుమార్తెను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేక శ్రీదేవి తండ్రి నరేందర్ ఛాతీలో నొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. ఇక సంజన పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పలేమని, శ్రీదేవికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు శ్రీదేవి భర్త శివానంద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వీరిద్దరికీ ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. కాగా ఆక్సిడెంటుకు కారణమైన నిందితులకు పూచీకత్తుపై బెయిల్ లభించింది. మరో ఇద్దరి అరెస్ట్: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్‌లను మంగళవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటరమణను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మిగతా ఇద్దరూ వెంకటరమణను మద్యం తాగేందుకు ప్రేరేపించి ప్రమాదానికి కారణమయ్యారని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
'నా కూతురు విషయంలో న్యాయం జరగలేదు'
హైదరాబాద్: పెద్దఅంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీదేవి, సంజనలను చిన్నారి రమ్య వెంకటరమణ పరామర్శించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన కూతురు విషయంలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చట్టాలు తేవాలని ఆయన డిమాండ్ చేశారు. జులై 1న కొంతమంది యువకులు మద్యం మత్తులో కారు నడిపి బంజారాహిల్స్ లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యతో పాటు ఆమె తాత, బాబాయ్‌ల మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న నిందితుడు శ్రావిల్‌కు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంజన కుటుంబానికి కష్టాలు
-
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
-
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
♦ మద్యం మత్తులో తల్లీకూతుళ్లను ఢీకొట్టిన యువకులు ♦ గాంధీ జయంతి రోజున హైదరాబాద్‌లో దారుణం ♦ బ్రెయిన్‌డెడ్ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సంజన ♦ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న తల్లి శ్రీదేవి ♦ నిందితుల్లో ఒకరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ మరో కుటుంబంలో చీకట్లు నింపింది. గాంధీ జయంతి రోజునే తప్పతాగి కారు నడుపుతున్న కొందరు యువకుల సరదా ఐదేళ్ల చిన్నారికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడగా.. చిన్నారి బ్రెయిన్‌డెడ్ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వారిలో ఒకరిని సోమవారం రాత్రి అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొందరు యువకులు మద్యం మత్తులో వాహనం నడిపి బంజారాహిల్స్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యను బలి తీసుకున్న ఉదంతం పూర్తిగా మరువకముందే ఈ దుర్ఘటన జరగడం విషాదకరం. పుట్టింటికని వెళుతూ.. సికింద్రాబాద్‌లోని మౌలాలి ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఎస్వీ శివానంద్ స్థానికంగా బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య శ్రీదేవి, కుమార్తెలు ప్రవళిక, సంజన. దసరా సెలవులు రావడంతో శ్రీదేవి ఆదివారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలతో పసుమాములలో కళానగర్‌లోని పుట్టింటికి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట వద్ద రాత్రి 9 గంటల సమయంలో వారు బస్సు దిగారు. శ్రీదేవి సంజనను ఎత్తుకుంది, పక్కన ప్రవళికతో కలసి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన సాంత్రో కారు (ఏపీ29 ఎన్ 5799) వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీదేవి, సంజన తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా రోడ్డు దాటిన ప్రవళిక త్రుటిలో తప్పించుకుంది. వారిని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటపడి ఆపారు. కారు తాళం చెవులు లాక్కుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ హడావుడిలోనే కారులోని ముగ్గురు యువకులు తప్పించుకుని పారిపోయారు. స్థానికులు శ్రీదేవి, సంజనలను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్చారు. సంజన పరిస్థితి విషమంగా మారడంతో ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఒక నిందితుడు అరెస్టు కారులో ఉన్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మత్తులో ఉండడమే కాదు.. కారు నడుపుతూ సైతం వారు మద్యం తాగినట్లు గుర్తించారు. ఆ కారులో మద్యం కలిపిన నీళ్ల బాటిల్‌తో పాటు తినుబండారాలు, గ్లాసులు లభించాయి. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిం దితుల్లో ఒకరైన వెంకటరమణ (38)ను హయత్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో నివాసముండే వెంకటరమణ మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొత్తపేట్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహించే యాదిరెడ్డి, ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్‌లతో కలసి కారులో బాటసింగారం పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ముందుగా కొని పెట్టుకున్న మద్యం సీసాలను తమ వెంట తీసుకెళ్లారు. రాత్రి వరకు అక్కడే గడిపిన వారు.. తిరిగి వచ్చే ముందు, కారులోనూ మద్యం తాగారు. ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తుండగా రాత్రి 9 గంటలకు పెద్ద అంబర్పేట్ వద్ద తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 109లతోపాటు మోటార్ వెహికిల్ యాక్ట్ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపా రు. మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కారులో దొరికిన సీసాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తామని చెప్పారు. బ్రెయిన్‌డెడ్ స్థితిలో చిన్నారి ఈ దుర్ఘటనలో సంజనకు తల, తుంటి, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సంజన బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిందని, పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక కడుపు, ఛాతీ, తలకు తీవ్ర గాయాలైన శ్రీదేవి సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులంతా ఆవేదనలో మునిగిపోయారు. సంజనకు చికిత్స నిమిత్తం రోజుకు రూ.30 వేలకుపైగా అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. నిరుపేదలైన చిన్నారి తల్లిదండ్రులు అంత సొమ్ము చెల్లించలేరని బంధువులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. -
‘బ్రెయిన్‌డెడ్’కు అర్థం మారిపోదా?
లండన్: బ్రెయిన్ డెడ్ అంటే మనిషి చనిపోయాడని అర్థం. చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘రియానిమ అడ్వాన్స్డ్బయోసెన్సైస్’ ద్వారా మనిషిని బతికించవచ్చనే సిద్ధాంతం ఉంది. ఇప్పుడుకాకున్నా భవిష్యత్తులో మూల కణాల చికిత్స, ఆమ్నో యాసిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం, చచ్చుబడిపోయిన నరాలకు ప్రేరణ కల్పించడం ద్వారా మనిషిని బతికించవచ్చనేది ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను, మెదడు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి ముఖ్య అవయవాలను వందల సంవత్సరాల వరకు భద్రపర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఓ అయిదు అత్యాధునిక ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని బతికించినట్లయితే ‘బ్రెయిన్ డెడ్’ అనే పదానికి నిర్వచనం మారిపోదా? అన్నది శాస్త్రవేత్తల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న. గుండె కొట్టుకోకపోతే, శ్వాస తీసుకోవడం ఆగిపోతే మనిషి ప్రాణాలు పోయాయని ఒకప్పుడు వైద్యులు నిర్ధారించేవారు. అలాంటివారు కూడా ఒక్కోసారి ఆధునిక వైద్యం వల్ల బతికిన సందర్భాలు అనుభవంలోకి వచ్చాయి. దాంతో ఎన్ని రకాలుగా వైద్యం అందించినా కొన్ని గంటలపాటు రోగికి గుండె కొట్టుకోకపోవడం, శ్వాస నిలిచిపోవడం, ఆక్సిజం పీల్చుకోలేక పోవడం, శరీరం చల్లబడి పోవడం జరిగినప్పుడు అలాంటి రోగిని ‘బ్రెయిన్ డెడ్’ అని నిర్ధారిస్తున్నారు. మరి అలాంటి వారిని కూడా బతికిస్తే ప్రాథమికంగా ‘బ్రెయిన్ డెడ్’ అనే పదానికే అర్థం లేదుకదా! గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రాన కూడా ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అని పిలవడం లేదు. ఎందుకంటే గుండె మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి రావడంతో ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు గుండె ఆగిపోయి కత్రిమ గుండెనే ఆ విధులు నిర్వహిస్తుంది. వాస్తవానికి బ్రెయిన్ స్పందించకపోయినట్లయితేనే బ్రెయిన్ డెడ్ అంటారు. గుండెను మార్చినా బ్రెయిన్ పనిచేయకవచ్చు. భవిష్యత్తులో బ్రెయిన్ డెడ్ రోగుల్లో బ్రెయిన్‌కు ప్రేరణ కల్పించడం ద్వారా ఆ మనిషి మళ్లీ జీవించగలిగితే అప్పటి వరకు తన సహజ జీవితాన్నే కొనసాగిస్తాడా? కొనసాగిస్తే బ్రియిన్డెడ్ గా అప్పటికే ధ్రువీకరించినందున ఆ వ్యక్తిని ఏమనాలి? రెండో జన్మ ఎత్తాడని అనాలా, పునర్జన్మ ఎత్తాడని అనాలా? మెదడు పూర్తిగా చచ్చిపోయిన వ్యక్తికి మూల కణ జన్యువులను ఎక్కించడం ద్వారా మెదడుకు ప్రాణం పోయవచ్చనేది మరో సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం మెదడులోని జన్యువులన్ని కొత్తవేకనుక సదరు వ్యక్తి పాత జీవితం గుర్తుండే అవకాశం లేదు. అప్పటి నుంచి ఆ సదరు వ్యక్తి అనుభూతులన్ని కొత్తవిగానే ఉండవచ్చు. మరప్పుడు ఆ కొత్త వ్యక్తి జీవితాన్ని ఏమనాలి? గుండెను మార్పిడి చేసినట్లే, మున్ముందు మెదడును మార్పిడి చేస్తే లేదా ఒకరి తలకాయని తీసి మరో వ్యక్తి మొండానికి తగిలిస్తే ఆ వ్యక్తి మెదడున్న వ్యక్తికి చెందిన వాడవుతాడా, మొండానికి చెందినవాడవుతాడా? ఇలాంటి నైతిక ప్రశ్నలు తుంపర తెంపరులుగా వస్తాయని శాస్తవేత్తలు చర్చిస్తున్నారు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుందని మనలాంటి వాళ్లం సరిపెట్టుకుంటే సరిపోతుందేమో! -
మరణంలేని మనస్విని
-
బ్రెయిన్‌డెడ్ అయిన ఎనిమిదేళ్ల బాలిక అవయవ దానం
హైదరాబాద్ (బంజారాహిల్స్) : ఈ నెల 22వ తేదీన గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన జి. మనస్విని అనే ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. గడిచిన మూడు రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనస్విని బ్రెయిన్‌డెడ్‌తో తుది శ్వాస విడవడంతో.. పాప తల్లిదండ్రులు ఆమె శరీర అవయవాలైన కాలేయం, రెండు మూత్రపిండాలు, గుండె కవాటాలను జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా దానం చేశారు. శనివారం అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తల్లిదండ్రులు వివరాలు వెల్లడించారు. -
పాకిస్తానీ బాలుడికి హైదరాబాదీ గుండె
ప్రాణాలు నిలిపిన బ్రెయిన్‌డెడ్ బాలుడి అవయవదానం సరిహద్దులు చెరిపిన మానవత చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాణాన్ని నిలపడంలో ఎల్లలు లేని అనురాగం ఆవిష్కృతం అయ్యింది. ఒక హైదరాబాదీ బ్రెయిన్‌డెడ్ చిన్నారి అవయవదానం పాకిస్తానీ బాలుడి ప్రాణాలను నిలబెట్టింది. చెన్నై వైద్యులు ఈ అపురూప శస్త్రచికిత్స చేశారు. పాకిస్తాన్ వంశావళికి చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడి గుండె సాధారణ స్థితి కంటే పెద్దదిగా ఉండడంతో శ్వాసకోస సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి గుండె మార్పిడి చికిత్స చేస్తేగానీ ప్రాణాలు దక్కని పరిస్థితి నెలకొందని వైద్యులు చెప్పారు. అవయవదాత కోసం అనేక రాష్ట్రాల్లో అన్వేషించారు. చివరకు ఆ అన్వేషణ ఫలించింది. హైదరాబాద్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రి వారు మంగళవారం ఫోన్ చేసి తమ వద్ద ఒక బాలుని గుండె అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వైష్ణవ్ (12) అనే బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకోగా అతని గుండెను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. వైష్ణవ్ గుండెను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విమానంలో భద్రంగా చెన్నై విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లతో 20 నిమిషాల వ్యవధిలోనే ఫ్రంటైర్ లైఫ్‌లైన్ ఆస్పత్రికి చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి గుండెను అమర్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలుడి గుండె తమిళనాడు రాష్ట్రానికి చేరుకుని పాకిస్తాన్‌కు చెందిన బాలుడికి ప్రాణం పోసిన సంఘటన భారత్, పాకిస్తాన్ సరిహద్దు సమస్యకు అతీతంగా హద్దుల్లేని మానవతావాదానికి అద్దం పట్టింది. -
చెన్నై అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత
కొరుక్కుపేట: చెన్నై అపోలో ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. బ్రెయిన్‌డెడ్ అయిన ఐదుగురు జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఒకో రోజు ఐదుగురి నుంచి 23 అవయవాలను సేకరించడం ద్వారా అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మద్రాసు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అవడంతో వారి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారని చెప్పారు. ఒక్క రోజులో ఐదుగురు నుంచి 23 అవయవాలను స్వాధీనం చేసుకున్నామని... దీని వలన 23 మందికి పునర్జన్మ ఇచ్చేందుకు అవకాశం కలిగిందని ఇది ఎంతో అరుదైన ఘనత అన్నారు. 23 అవయవాల్లో ఐదు లివర్లు, ఒక గుండె, నాలుగు కిడ్నీలు అపోలో ఆసుపత్రి తీసుకోగా, మిగిలిన ఒక గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి, నాలుగు కిడ్నీలు కోయంబత్తూరు కేజీహెచ్‌కు, ఒక కిడ్నీ కామాక్షి ఆసుపత్రికి, ఒక కిడ్నీ గ్లోబల్ ఆస్పత్రికి, ఆరు నేత్రాలను శంకర్ నేత్రాలయాకు అందించినట్లు తెలిపారు.