లండన్: బ్రెయిన్ డెడ్ అంటే మనిషి చనిపోయాడని అర్థం. చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘రియానిమ అడ్వాన్స్డ్‌బయోసెన్సైస్’ ద్వారా మనిషిని బతికించవచ్చనే సిద్ధాంతం ఉంది. ఇప్పుడుకాకున్నా భవిష్యత్తులో మూల కణాల చికిత్స, ఆమ్నో యాసిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం, చచ్చుబడిపోయిన నరాలకు ప్రేరణ కల్పించడం ద్వారా మనిషిని బతికించవచ్చనేది ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను, మెదడు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి ముఖ్య అవయవాలను వందల సంవత్సరాల వరకు భద్రపర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఓ అయిదు అత్యాధునిక ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి.
చనిపోయిన వ్యక్తిని బతికించినట్లయితే ‘బ్రెయిన్ డెడ్’ అనే పదానికి నిర్వచనం మారిపోదా? అన్నది శాస్త్రవేత్తల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న. గుండె కొట్టుకోకపోతే, శ్వాస తీసుకోవడం ఆగిపోతే మనిషి ప్రాణాలు పోయాయని ఒకప్పుడు వైద్యులు నిర్ధారించేవారు. అలాంటివారు కూడా ఒక్కోసారి ఆధునిక వైద్యం వల్ల బతికిన సందర్భాలు అనుభవంలోకి వచ్చాయి. దాంతో ఎన్ని రకాలుగా వైద్యం అందించినా కొన్ని గంటలపాటు రోగికి గుండె కొట్టుకోకపోవడం, శ్వాస నిలిచిపోవడం, ఆక్సిజం పీల్చుకోలేక పోవడం, శరీరం చల్లబడి పోవడం జరిగినప్పుడు అలాంటి రోగిని ‘బ్రెయిన్ డెడ్’ అని నిర్ధారిస్తున్నారు.
మరి అలాంటి వారిని కూడా బతికిస్తే ప్రాథమికంగా ‘బ్రెయిన్ డెడ్’ అనే పదానికే అర్థం లేదుకదా! గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రాన కూడా ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అని పిలవడం లేదు. ఎందుకంటే గుండె మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి రావడంతో ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు గుండె ఆగిపోయి కత్రిమ గుండెనే ఆ విధులు నిర్వహిస్తుంది.
వాస్తవానికి బ్రెయిన్ స్పందించకపోయినట్లయితేనే బ్రెయిన్ డెడ్ అంటారు. గుండెను మార్చినా బ్రెయిన్ పనిచేయకవచ్చు. భవిష్యత్తులో బ్రెయిన్ డెడ్ రోగుల్లో బ్రెయిన్‌కు ప్రేరణ కల్పించడం ద్వారా ఆ మనిషి మళ్లీ జీవించగలిగితే అప్పటి వరకు తన సహజ జీవితాన్నే కొనసాగిస్తాడా? కొనసాగిస్తే బ్రియిన్‌డెడ్ గా అప్పటికే ధ్రువీకరించినందున ఆ వ్యక్తిని ఏమనాలి? రెండో జన్మ ఎత్తాడని అనాలా, పునర్జన్మ ఎత్తాడని అనాలా?
మెదడు పూర్తిగా చచ్చిపోయిన వ్యక్తికి మూల కణ జన్యువులను ఎక్కించడం ద్వారా మెదడుకు ప్రాణం పోయవచ్చనేది మరో సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం మెదడులోని జన్యువులన్ని కొత్తవేకనుక సదరు వ్యక్తి పాత జీవితం గుర్తుండే అవకాశం లేదు. అప్పటి నుంచి ఆ సదరు వ్యక్తి అనుభూతులన్ని కొత్తవిగానే ఉండవచ్చు.
మరప్పుడు ఆ కొత్త వ్యక్తి జీవితాన్ని ఏమనాలి? గుండెను మార్పిడి చేసినట్లే, మున్ముందు మెదడును మార్పిడి చేస్తే లేదా ఒకరి తలకాయని తీసి మరో వ్యక్తి మొండానికి తగిలిస్తే ఆ వ్యక్తి మెదడున్న వ్యక్తికి చెందిన వాడవుతాడా, మొండానికి చెందినవాడవుతాడా? ఇలాంటి నైతిక ప్రశ్నలు తుంపర తెంపరులుగా వస్తాయని శాస్తవేత్తలు చర్చిస్తున్నారు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుందని మనలాంటి వాళ్లం సరిపెట్టుకుంటే సరిపోతుందేమో!