
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
♦ మద్యం మత్తులో తల్లీకూతుళ్లను ఢీకొట్టిన యువకులు
♦ గాంధీ జయంతి రోజున హైదరాబాద్‌లో దారుణం
♦ బ్రెయిన్‌డెడ్ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సంజన
♦ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న తల్లి శ్రీదేవి
♦ నిందితుల్లో ఒకరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ మరో కుటుంబంలో చీకట్లు నింపింది. గాంధీ జయంతి రోజునే తప్పతాగి కారు నడుపుతున్న కొందరు యువకుల సరదా ఐదేళ్ల చిన్నారికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడగా.. చిన్నారి బ్రెయిన్‌డెడ్ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వారిలో ఒకరిని సోమవారం రాత్రి అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొందరు యువకులు మద్యం మత్తులో వాహనం నడిపి బంజారాహిల్స్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యను బలి తీసుకున్న ఉదంతం పూర్తిగా మరువకముందే ఈ దుర్ఘటన జరగడం విషాదకరం.
పుట్టింటికని వెళుతూ..
సికింద్రాబాద్‌లోని మౌలాలి ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఎస్‌వీ శివానంద్ స్థానికంగా బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య శ్రీదేవి, కుమార్తెలు ప్రవళిక, సంజన. దసరా సెలవులు రావడంతో శ్రీదేవి ఆదివారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలతో పసుమాములలో కళానగర్‌లోని పుట్టింటికి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట వద్ద రాత్రి 9 గంటల సమయంలో వారు బస్సు దిగారు. శ్రీదేవి సంజనను ఎత్తుకుంది, పక్కన ప్రవళికతో కలసి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన సాంత్రో కారు (ఏపీ29 ఎన్ 5799) వారిని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీదేవి, సంజన తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా రోడ్డు దాటిన ప్రవళిక త్రుటిలో తప్పించుకుంది. వారిని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటపడి ఆపారు. కారు తాళం చెవులు లాక్కుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ హడావుడిలోనే కారులోని ముగ్గురు యువకులు తప్పించుకుని పారిపోయారు. స్థానికులు శ్రీదేవి, సంజనలను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్చారు. సంజన పరిస్థితి విషమంగా మారడంతో ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ఒక నిందితుడు అరెస్టు
కారులో ఉన్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మత్తులో ఉండడమే కాదు.. కారు నడుపుతూ సైతం వారు మద్యం తాగినట్లు గుర్తించారు. ఆ కారులో మద్యం కలిపిన నీళ్ల బాటిల్‌తో పాటు తినుబండారాలు, గ్లాసులు లభించాయి.
ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిం దితుల్లో ఒకరైన వెంకటరమణ (38)ను హయత్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో నివాసముండే వెంకటరమణ మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొత్తపేట్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహించే యాదిరెడ్డి, ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్‌లతో కలసి కారులో బాటసింగారం పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు.
ముందుగా కొని పెట్టుకున్న మద్యం సీసాలను తమ వెంట తీసుకెళ్లారు. రాత్రి వరకు అక్కడే గడిపిన వారు.. తిరిగి వచ్చే ముందు, కారులోనూ మద్యం తాగారు. ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తుండగా రాత్రి 9 గంటలకు పెద్ద అంబర్‌పేట్ వద్ద తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 109లతోపాటు మోటార్ వెహికిల్ యాక్ట్ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపా రు. మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కారులో దొరికిన సీసాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తామని చెప్పారు.
బ్రెయిన్‌డెడ్ స్థితిలో చిన్నారి
ఈ దుర్ఘటనలో సంజనకు తల, తుంటి, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సంజన బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిందని, పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక కడుపు, ఛాతీ, తలకు తీవ్ర గాయాలైన శ్రీదేవి సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులంతా ఆవేదనలో మునిగిపోయారు. సంజనకు చికిత్స నిమిత్తం రోజుకు రూ.30 వేలకుపైగా అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. నిరుపేదలైన చిన్నారి తల్లిదండ్రులు అంత సొమ్ము చెల్లించలేరని బంధువులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.