
అవయదానం చేసిన వైష్ణవ్ (ఫైల్)
ప్రాణాలు నిలిపిన బ్రెయిన్‌డెడ్ బాలుడి అవయవదానం
సరిహద్దులు చెరిపిన మానవత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాణాన్ని నిలపడంలో ఎల్లలు లేని అనురాగం ఆవిష్కృతం అయ్యింది. ఒక హైదరాబాదీ బ్రెయిన్‌డెడ్ చిన్నారి అవయవదానం పాకిస్తానీ బాలుడి ప్రాణాలను నిలబెట్టింది. చెన్నై వైద్యులు ఈ అపురూప శస్త్రచికిత్స చేశారు. పాకిస్తాన్ వంశావళికి చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడి గుండె సాధారణ స్థితి కంటే పెద్దదిగా ఉండడంతో శ్వాసకోస సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి గుండె మార్పిడి చికిత్స చేస్తేగానీ ప్రాణాలు దక్కని పరిస్థితి నెలకొందని వైద్యులు చెప్పారు. అవయవదాత కోసం అనేక రాష్ట్రాల్లో అన్వేషించారు. చివరకు ఆ అన్వేషణ ఫలించింది.
హైదరాబాద్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రి వారు మంగళవారం ఫోన్ చేసి తమ వద్ద ఒక బాలుని గుండె అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వైష్ణవ్ (12) అనే బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకోగా అతని గుండెను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. వైష్ణవ్ గుండెను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విమానంలో భద్రంగా చెన్నై విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లతో 20 నిమిషాల వ్యవధిలోనే ఫ్రంటైర్ లైఫ్‌లైన్ ఆస్పత్రికి చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి గుండెను అమర్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలుడి గుండె తమిళనాడు రాష్ట్రానికి చేరుకుని పాకిస్తాన్‌కు చెందిన బాలుడికి ప్రాణం పోసిన సంఘటన భారత్, పాకిస్తాన్ సరిహద్దు సమస్యకు అతీతంగా హద్దుల్లేని మానవతావాదానికి అద్దం పట్టింది.