
మరణిస్తూ నలుగురికి కొత్త జీవితం
కొరుక్కుపేట(చెన్నై): తాను చనిపోతూ మరో నలుగురుకి కొత్త జీవితాన్ని అందించాడు బ్రెయిన్‌డెడ్‌కు గురైన 33ఏళ్ల యువకుడు. స్థానిక ట్రిప్లికేన్‌లోని దుర్గా లాయిడ్స్ రోడ్డులో నివాసం ఉంటున్న ఆర్.జయప్రకాశ్(33) ప్రైవేట్ ఫ్యాబ్రికేటింగ్ సంస్థలో అసెంబ్లింగ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పనిచేస్తున్న స్థలంలోనే తలకు తీవ్రగాయం కావడంతో చికిత్సకోసం ఈనెల 13న శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈనెల 15న జయప్రకాశ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు.
దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్ మహ్మద్ రేలా బృందం అతని అవయవాలను కలకత్తాకు చెందిన 54ఏళ్ల వ్యాపార వేత్తకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగా, డాక్టర్ ఎస్.వెంకటరమణన్ బృందం నైవేలికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మరో కిడ్నీ, గుండెను మరో రెండు ఆసుపత్రులకు తరలించారు. కార్నియాను భవిష్యత్తు ఉపయోగం కోసం ఎస్‌ఆర్‌ఎంసీలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు.