రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి? | jayalalithaa may be discharged in two weeks, say aiadmk spokespersons | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి?

Published Tue, Nov 8 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి?

రెండు వారాల్లో జయలలిత డిశ్చార్జి?

ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. కీలకమైన అంశాలన్నీ అదుపులోనే ఉన్నాయని.. ప్రస్తుతం ఆమెకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో 15 రోజుల్లో ఇంటికి పంపే అవకాశం ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్‌లోకి మార్చే విషయంపై మీడియా ప్రశ్నించగా.. అక్కడకు, ఇక్కడకు తేడా అత్యవసర పరికరాలు మాత్రమేనని ఆయన వివరించారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు.. పూర్తిస్థాయిలో కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు. 
 
మరికొన్ని రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలోనే ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించిన వెంటనే ఆమె తనంతట తానుగా కూర్చోలేకపోతున్నారని, ప్రస్తుతం ఘన-ద్రవం లాంటి పదార్థాలు తీసుకుంటున్నారని చెప్పారు. 
 
ఇప్పుడు కూడా వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు తప్ప వేరే ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) లోపలకు అనుమతించడం లేదు. అక్కడి నుంచే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తన సలహాదారులతో ప్రత్యేకమైన ఆడియో వ్యవస్థ ద్వారా మాట్లాడుతున్నారని పొన్నియన్ చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement