జయలలిత మాట్లాడారు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కోలుకుంటున్నారని, ఆమె కీలక అవయవాలన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాలర్ మైకు ద్వారా ఆమె కొద్ది నిమిషాలు మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రతిరోజూ కొంతసేపు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. అయితే 90 శాతం సమయం మాత్రం ఆమె తనంతట తానే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ఆమెకు స్టాటిక్ మరియు యాక్టివ్ ఫిజియోథెరపీ అందిస్తున్నామని.. ఇక తర్వాత ఆమె లేచి నిలబడి, నడవడమే తరువాయి అని వివరించారు.
జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఎప్పుడు డిశ్చార్జి అయి వెళ్లాలన్నది ఆమె ఇష్టమేనని ఆయన అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ పాలనాపగ్గాలు చేపట్టాలంటూ అన్నాడీఎంకే అభిమానులు, కార్యకర్తలు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు, అన్నదానాలు చేశారు.