అమ్మకు సందర్శకుల తాకిడి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సందర్శకుల తాకిడి వెల్లువెత్తుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తదితరులు సోమవారం నాడు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అయితే జయలలిత ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నందున ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని వైద్యులు సూచించడంతో.. వైద్యులతోనే మాట్లాడి బయటకు వచ్చేశారు. జయలలిత కోలుకుంటారని, ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని బయట మీడియాతో చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు.
మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పాలన వ్యవహారాలను చూసుకుంటున్నారని, అమ్మ మళ్లీ వస్తారని, పాలన పూర్తిగా గాడిలో పడుతుందని చెబుతున్నారు.