
ఆరోగ్యంగా సీఎం జయలలిత
డిశ్చార్జ్ ఆమె అభీష్టం: అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొన్నిరోజుల క్రితమే పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి జయలలిత సహజస్థితికి చేరుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆమె కోరుకుంటే ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చన్నారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22 అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు సుదీర్ఘ చికిత్స అందించారు.
అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ఆమె మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ వల్ల సీఎం సహజస్థితికి చేరుకున్నారన్నారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు.