జయ తుదిశ్వాస వరకు అంతా రహస్యమే!
న్యూఢిల్లీ: చెన్నై నగరంలోని ఆపోలో ఆస్పత్రిలో 74 రోజుల పాటు చికిత్సపొంది చివరకు తుదిశ్వాస విడిచినప్పటికీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆది నుంచి నెలకొన్న అనుమానాలు, ఆపోహలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆదివారం సాయంత్రం వచ్చిన గుండెపోటు నుంచి జయలలిత కోలుకోలేకపోయారంటూ ఆస్పత్రి వర్గాలు చెప్పిన మాటలను నమ్ముతున్న వారు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడో చనిపోతే ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదని సందేహించే వారు ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలు, అనుమానాలు అపోహలు కూడా ఏర్పడిన విషయం తెల్సిందే.
వీవీఐపీల విషయంలోనే ఆస్పత్రి వర్గాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తాయి? వాస్తవ సమాచారం ప్రజలకు తెలియకుండా ఎందుకు తొక్కి పెడతారు? వాళ్లపైన ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి? ‘వీవీఐపీల చికిత్స విషయంలో మాపై రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. అధికార పార్టీల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి, మీడియా వర్గాల నుంచి, కొన్ని సందర్భాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. మేము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. షేషెంట్ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మేము ఎలాంటి సమాచారాన్ని బయటకు విడుదల చేయకూడదు. పలువురు వైద్యులు పలురకాలుగా వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి కేసుల్లో మేము ఎప్పటికప్పుడు మెడికల్ బులిటెన్లను విడదల చేయడానికి ఓ అధికార ప్రతినిధిని నియమిస్తాం. ఆ ప్రతినిధి కుటంబసభ్యుల అభిప్రాయం మేరకు బులిటెన్ తయారు చేస్తారు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]
బులిటెన్ మొదట కుటుంబ సభ్యులకు చదివించి వినిపిస్తాం. ఆ తర్వాత వారి గీకారంతోనే బయటకు ప్రకటిస్తాం’ అని శివసేన చీఫ్ బాల్ ఠాక్రేతోపాటు పలువురు రాజకీయ వేత్తలకు వైద్యసేవలు అందించిన, ప్రస్తుతం ఓ సినిమా నటుడికి వైద్య సేవలు అందిస్తున్న ముంబైలోని లీలావతి ఆస్పత్రి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్, లీలావతి ఆస్పత్రి ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పాండేతోపాటు వీవీఐపీలకు చికిత్సలు అందించిన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ముంబై, ఢిల్లీలోని ఆస్పత్రుల డాక్టర్లు తెలిపారు.
రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్ల విషయంలో వారి అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకొని సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తుందని వారన్నారు. ఆ క్షణాన నిజాన్ని తట్టుకునే పరిస్థితి వారికుందా, లేదా? అన్న అంశాన్ని కూడా పరిగణలోని తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా దగ్గరి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వ్యవహరించాల్సి ఉంటుందని వారు చెప్పారు. జయలలితకు కుటుంబ సభ్యలు ఎవరులేరు కనక ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో తమకు తెలియదని వారన్నారు.
ఇదే విషయాన్ని జయలలితకు చికిత్స అందించిన ఆపోలో ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించగా ఎక్కువ వరకు తమిళనాడు ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకోవాల్సి వచ్చిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జయలలిత మరణాన్ని అధికారికంగా అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించేవరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై చెలరేగిన ఊహాగానాల్లో నిజమెంతో, అబద్ధమెంతో పన్నీర్‌సెల్వం ప్రభుత్వం ప్రకటించేవరకు రహస్యమే.