సీసీయూ నుంచి బయటకు అమ్మ!
సీసీయూ నుంచి బయటకు అమ్మ!
Published Fri, Nov 4 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి గదిలోకి మారుస్తారట. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వివరించారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు.
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలితను (68) సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇప్పటికీ కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని, అందువల్ల మరికొంత కాలం పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల కన్సల్టెంటులు, డయాబెటాలజిస్టు, ఎండోక్రినాలజిస్టు తదితర నిపుణులు ప్రస్తుతం జయలలితకు చికిత్స అందిస్తున్నారు. చిట్టచివరి సారిగా అక్టోబర్ 21వ తేదీన ఆమె హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. అప్పుడు ఆమె మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. అమ్మను ఎప్పుడు ఆస్పత్రి నుంచి పంపాలన్నది వైద్యుల నిర్ణయమేనని పొన్నియన్ చెప్పారు. ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, మిగిలిన సమస్యలను ఆమె గదిలో ఉండగా లేదా ఇంట్లో ఉండగా నయం చేయొచ్చని ఆయన అన్నారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత కారణంగానే ఆమె దాదాపు 18 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారని పొన్నియన్ తెలిపారు. తగిన చికిత్స తర్వాత జ్వరం తగ్గిందని, ఆ తర్వాత బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు అంతా కలిసి అమ్మను సాధారణ స్థితికి దగ్గరగా తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement