జయలలిత ఆరోగ్యం విషమం
చెన్నై: గత రెండు నెలలుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం విషమంగా ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్నారని, రేపో మాపో సీఎం జయలలిత ఇంటికి వెళ్లే అవకాశం ఉందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఆమె కోరుకున్నప్పుడు ఇంటికి వెళ్లడమే తరువాయి అని అపోలో వైద్యులు ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్పెషల్ వార్డు నుంచి జయలలితను ఐసీయూకు షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ ఎలాంటి ప్రకటన చేయకుండానే రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. అపోలో డాక్టర్ల బృందం లండన్ వైద్యుడు రిచర్డ్ ను సంప్రదించి జయకు ఎలాంటి చికిత్స అందజేయాలో తెలుసుకున్నారు. జయలలిత అనారోగ్యం గురించి తెలుసుకున్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయ అభిమానులు అర్ధరాత్రి ఒంటిగంట కావస్తున్నా పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రికి తరలి వస్తుండంతో వారికి అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.
లండన్ వైద్యులతో అపోలో డాక్టర్ల సంప్రదింపులు
ప్రస్తుతం జయలలితకు హార్ట్ అసిస్ట్ డివైస్ ద్వారా ప్రత్యేక చికిత్స అందజేస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జయలలిత చికిత్స పొందుతున్నారు. గతంలో చెన్నైకి వచ్చి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చికిత్స అందజేసిన లండన్ వైద్యుల బృందం అపోలో వైద్యులతో సంప్రదింపులు జరుపుతోంది. అపోలో కార్డియాలజిస్ట్‌లు, పల్మనాలజిస్ట్‌లతో లండన్ డాక్టర్ రిచర్డ్ సంప్రదింపులు జరిపి, జయకు ఏ రకమైన చికిత్స అందజేయాలో తెలియజేసినట్లు సమాచారం.
జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. అపోలో చైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేసి... జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. విద్యాసాగర్ రావు ముంబై నుంచి హుటాహుటిన బయలుదేరి చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం చెన్నై వెళ్లి జయలలితను పరామర్శించనున్నారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై చేరుకుని అపోలో వద్ద నెలకొన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
విద్యాసంస్థలకు సోమవారం సెలవు
సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో మద్రాస్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలు, పాఠశాలలకు సోమవారం సెలవుదినంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఎడ్యూకేషన్ బోర్డ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఆస్పత్రిలోనే రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుంచి మళ్లీ కోలుకుంటారని రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అపోలో ఆస్పత్రికి తరలివస్తున్న అభిమానులు
అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున జయ అభిమానులు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అస్పత్రికి తరలి వస్తుండటంతో ఆస్పతి వద్ద కేంద్ర, పారా మిలిటరీ బలగాలు ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. అపోలో ఆస్పత్రి వద్ద అవాంచనీయ ఘటనలు తలెత్తుతాయని భావించిన ఉన్నతాధికారులు అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్, రెస్టారెంట్లను ఖాళీ చేయిస్తున్నారు.