
అమ్మ కోసం.. 25 రోజులుగా అక్కడే!
వాళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు. పనిచేసుకుంటే తప్ప పొట్ట నిండని పరిస్థితి వాళ్లది.
వాళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు. పనిచేసుకుంటే తప్ప పొట్ట నిండని పరిస్థితి వాళ్లది. చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వాళ్లంతా.. గత 25 రోజులుగా ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. తమవాళ్లు ఎవరికో ఆరోగ్యం బాగోలేదని కాదు.. తామంతా అమ్మగా భావించే జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని! అలాల్ బాయి (60) వెల్లూరు జిల్లా వనయింబాడి ప్రాంతంలో టైలర్ పని చేసుకుంటూ ఉంటారు.
ఆమె సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటివరకు చెన్నై అపోలో ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె అక్కడే ఉంటారు. రాత్రిపూట మాత్రం ఎమ్మెల్యే హాస్టల్ కారిడార్లలో నిద్రపోతున్నారు. ప్రస్తుతానికి తాను వ్యాపారం మానేశానని, అమ్మ మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నానని ఆమె చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత 'జ్వరం, డీహైడ్రేషన్'తో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఒక్క శశికళ తప్ప.. మరెవ్వరికీ ఆమెను చూడటానికి కూడా అనుమతి లభించడం లేదు.
మడిపాక్కం ప్రాంతానికి చెందిన సురేష్ బాబు (41) ఒక ప్రైవేటు కంపెనీ మార్కెటింగ్‌లో ఉన్నాడు. ఫార్మల్ దుస్తులలో తిరుగుతుండే అతను కూడా సెప్టెంబర్ 23 నుంచి అపోలో ఆస్పత్రివద్దే ఉంటున్నాడు. చాలాకాలంగా అన్నాడీఎంకే పార్టీ సభ్యుడైన సురేష్.. తనకు అమ్మ ఆరోగ్యం తప్ప ఏమీ అక్కర్లేదని చెప్పాడు. పలు ఆలయాల్లో రోజూ ప్రార్థనలు చేస్తున్నానని, పోయెస్ గార్డెన్‌కు కూడా రోజూ వెళ్తున్నానని అన్నాడు. మార్కెటింగ్‌లో ఉన్నందున రోజూ ఆఫీసుకు వెళ్లక్కర్లేదని, అందువల్ల ఫోన్‌లో క్లయింట్లతో మాట్లాడుకుని మేనేజ్ చేసుకుంటున్నానని తెలిపాడు. ఇంకా ఇలా చాలామంది అపోలో ఆస్పత్రి బయట వేచి చూస్తున్నారు. వేలాది మంది అక్కడే గుమిగూడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్ల బంధువులకు మాత్రం కొంత ఇబ్బంది తప్పడం లేదు.