అమ్మ ఆరోగ్యం.. ఇంకా గోప్యమే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పడమే తప్ప ఇంతవరకు ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటో, ఆమెకు ఎలాంటి చికిత్స చేస్తున్నారో ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. అంతేకాదు, గత వారం రోజుల నుంచి అసలు అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్లు కూడా ఇవ్వడం లేదు. అమ్మను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర్నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మాజీ గవర్నర్లు, కీలక నేతలు.. అనేకమంది రోజూ వస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా వస్తారని చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న ఐసీయూ సమీపానికి కూడా వెళ్లనివ్వడం లేదు. ఎంత పెద్ద నాయకులైనా కేవలం వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సిందే. మరి ప్రధానమంత్రినైనా పంపుతారో లేదో చూడాలి. అపోలో ఆస్పత్రి వద్ద వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు గత 24 రోజులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఆమెకోసం ప్రత్యేకప్రార్థనలు, అన్నదానాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జయలలిత వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ చెప్పడం లేదు. లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బాలే, ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు చెన్నై అపోలో ఆస్పత్రి వైద్య బృందం ఈ 24 రోజుల నుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి కూడా వైద్యనిపుణులను రప్పిస్తున్నారు.
అయితే.. కేవలం జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహం లాంటి సామాన్య సమస్యలతోనే ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇన్నాళ్లుగా ఎందుకు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది, ఆమె మళ్లీ తిరిగి అధికార పగ్గాలు ఎప్పుడు చేపడతారు అనే ప్రశ్నలు సామాన్య పౌరుల దగ్గర నుంచి పార్టీ అభిమానులు, నాయకులు, చివరకు ప్రస్తుతం ముఖ్యమంత్రి శాఖలన్నింటినీ చేపట్టిన ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం వరకు అందరికీ వస్తున్నాయి. వాటికి సమాధానం ఇచ్చేవాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం జయలలిత ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల అయితే.. జయలలిత కళ్లు తెరిచారని, వెంటిలేటర్ కూడా తీసేశారని విపరీతంగా ప్రచారం జరిగింది. జయలలిత చికిత్సకు వేగంగా స్పందిస్తున్నారని, ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు.
వీళ్లందరూ చెప్పే మాటల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో.. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదదో మాత్రం సామాన్య ప్రజలకు ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకు ఇంత గోప్యత పాటించాల్సి వస్తోందో అర్థం కావడం లేదు. అపోలో వైద్యులు మధ్యమధ్యలో ఒకోసారి అమ్మ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్లు జారీ చేస్తున్నారు. సాధారణంగా హెల్త్ బులెటిన్ అంటే, అందులో షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన ఇతర పారామీటర్లు ఎలా ఉన్నాయన్న వివరాలు ఉంటాయి. కానీ జయలలిత హెల్త్ బులెటిన్‌లో మాత్రం ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని మాత్రమే చెబుతున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన బులెటిన్లో... ఊపిరితిత్తుల్లో శ్లేష్మపొరను తొలగించే మందులు వాడుతూ మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని, ఫిజియోథెరపీ ద్వారా ఊపిరి తీసుకునేందుకు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటెన్సివిస్ట్‌ల ఆధ్వర్యంలో సీఎం ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇంకా చాన్నాళ్లే జయ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని.. పునరుద్ఘాటించారు. అలాగే వైద్యచికిత్సలో అన్నిరకాల సమగ్ర చర్యల్లో భాగంగా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
జయలలిత ఆరోగ్యం గురించిన వివరాలను వెల్లడించాలని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి చేసిన డిమాండును అన్నాడీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. తాము ప్రజలకు జవాబుదారీ తప్ప డీఎంకేకు కాదని చెప్పాయి. దీంతో అసలు ఏం జరుగుతోందోనన్న ఆందోళన ప్రజల్లో కలిగింది. కానీ వీటిన్నింటికీ సమాధానాలు మాత్రం రావడం లేదు.