మృతి వదంతి రేపింది ఈ చానెలే!!
సరిగ్గా సాయంత్రం 5.30 గంటల సమయం. ఒక్కసారిగా అలజడి. ఉద్రిక్తత. జయలలిత అభిమానులంతా చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి దిశగా ఒక్కసారిగా పోటెత్తారు. పోలీసులను తోసుకుంటూ బారికేడ్లను దాటుకొని ఆస్పత్రిపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడులకు దిగారు. కారణం తమిళ చానెళ్లలో ఒక్కసారిగా గుప్పుమన్న కథనాలు... చెన్నైను ఒక్కసారిగా మునివేళ్లపై నిలబెట్టాయి. ఉద్రికత్తతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. క్షణాల్లో ఈ కథనాలు దేశమంతటికీ పాకిపోయాయి. జాతీయ మీడియా చానెళ్లు సైతం జయలలిత కన్నుమూశారంటూ కథనాలు ఇచ్చాయి.
నిజానికి అన్నింటికన్నా ముందు ఈ వదంతిని ప్రసారం చేసింది అన్నాడీఎంకే అధికారిక చానెల్ ‘జయ టీవీ’యేనని తెలుస్తోంది. జయలలిత కన్నుమూశారంటూ ఆ చానెల్ పొరపాటున ఆమె జ్ఞాపకాలను ప్రసారం చేయడంతో.. ఆ వెంటనే తమిళ చానెళ్లు జయలలిత కన్నుమూశారంటూ ఫ్లాష్ కథనాలు ప్రసారం చేశాయి. తమిళనాడు పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జాతీయ చానెళ్లు కూడా జయలలిత కన్నుమూత బ్రేకింగ్స్ ఇచ్చాయి.
అధికార అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోని జెండాను సైతం సగం వరకు అవనతం చేశారు. దీంతో చెన్నై అంతటా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ వెంటనే అపోలో ఆస్పత్రి సైతం జోక్యం చేసుకొని వివరణ ఇవ్వడం, జయలలితకు లైఫ్‌సపోర్ట్ కొనసాగుతున్నదని స్పష్టత ఇవ్వడంతో ఉద్రిక్తత సడలింది. ముందుజాగ్రత్తగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించడంతో పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరోవైపు అపోలో ఆస్పత్రి ప్రకటనతో జయలలిత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.