మరోసారి పరీక్షలు.. చెన్నైలో హై అలర్ట్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసినట్టు వచ్చిన వదంతులను అపోలో ఆస్పత్రి తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి అన్నాడీఎంకే అగ్ర నేతల భేటీ వైపు మళ్లింది. జయలలిత ఆరోగ్యం తీవ్రంగా విషమించడం, ఆమె మృతి చెందినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జయలలిత వారసుడు ఎవరన్నదానిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం వారసుడిపై ప్రకటన వెలువడే అవకాశముందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. జయలలిత నిచ్చెలి శశికళకు కూడా మంచి పదవి దక్కే అవకాశముందని వినిపిస్తోంది.
అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు మరోసారీ పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. జయలలిత గుండె పనితీరు, ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పరీక్షలు నిర్వహించి.. రాత్రి 11 గంటలకు కీలక ప్రటకన చేసే అవకాశముందని సమాచారం. జయలలితకు ప్రస్తుతం న్యూరాలజిస్టులు చికిత్స అందిస్తున్నారు.
జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెప్తున్న నేపథ్యంలో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. జయలలిత ఆరోగ్య పరిణామాల నేపథ్యంలో చెన్నై నగరమంతటా బంద్ తరహా వాతావరణం నెలకొంది. అడుగడుగున కేంద్ర బలగాలు, పోలీసులు మోహరించారు.