జయపై రూమర్స్.. చెన్నై కుతకుత!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో చెన్నై అట్టుడికిపోయింది. జయలలిత కన్నుమూశారంటూ కథనాలు రావడంతో తమిళనాడు ఒక్కసారిగా వేడెక్కింది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిపైకి అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ విధ్వంసాలకు పూనుకున్నారు. ఆస్పత్రిపైకి రాళ్లతో విరుచుకుపడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జాతీయ మీడియా సంస్థలు సైతం జయలలిత కన్నుమూశారని కథనాలు ఇవ్వడంతో ఏం జరుగుతున్నదో అర్థం కాక చెన్నై నగరం కుతకుతలాడింది.
అయితే, ఈ కథనాలను, వదంతులను అపోలో ఆస్పత్రి కొట్టిపారేసింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని, ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. జయలలిత ఆరోగ్యంపై తాము అధికారికంగా ఏమీ చెప్పకముందే ఆమె గురించి వదంతులు వచ్చినట్టు స్పష్టంచేసింది. అపోలో, ఎయిమ్స్‌కు చెందిన పెద్ద వైద్యబృందం అమ్మకు లైఫ్ సేవింగ్ చికిత్స కొనసాగిస్తున్నదని అపోలో ట్వీట్ చేసింది.
అయితే, అంతకుముందు జయలలిత మృతి వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సగంవరకు అవనతం చేశారు. జాతీయ మీడియా చానెళ్లు తమ ట్విట్టర్ పేజీల్లో జయలలిత మృతికి సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. దీంతో జయలలిత నిజంగా చనిపోయారేమోనన్న భావన నెటిజన్ల ఏర్పడింది. చాలామంది సినీ ప్రముఖులు, నెటిజన్లు కూడా జయలలిత మృతిపై సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇక, తమిళనాడు అంతటా అమ్మ అభిమానుల హాహాకారాలు, విధ్వంసాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.