‘శుభవార్త వింటామన్న నమ్మకముంది’
చెన్నై: ‘మేం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నాం. మాకు నమ్మకముంది. మేం త్వరలోనే శుభవార్త వింటాం’ .. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఎదుట భారీసంఖ్యలో గుమిగూడిన ఆమె అభిమానులను ఎవరినీ కదిలించినా.. వారి నోట ఇదే మాట వస్తున్నది.
చెన్నైలోని అపోలో ఆస్పత్రి పరిసరాలు వేలాదిమంది జయలలిత అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నేత కోలుకోవాలని చాలామంది దేవుడిని ప్రార్థిస్తుండగా.. మరికొందరు భోరున విలపిస్తున్నారు. ఇంకొందరు ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని కలత చెందుతున్నారు.
ప్రజానుకూల పథకాలు, విధానాలతో జనంలో గుండెల్లో ‘అమ్మ’గా కోలువైన జయలలిత ఆరోగ్యం తీవ్రంగా విషమించిందన్న వార్త తమిళనాడు అంతటా దావానలంలా పాకడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆమె అభిమానులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దసంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు చెన్నైకి చేరుకుంటున్నారు. తిరువన్నమలై జిల్లా నుంచి వచ్చిన పరిమళ, నార్త్ చెన్నైకి చెందిన సుబ్రహ్మణియన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఆస్పత్రి వద్ద చాలామంది అమ్మ అభిమానుల్లో విషాదఛాయలు కనిపిస్తున్నాయి. జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్‌కు చెందిన వృద్ధ మహిళ రజినీ తరచూ భోరున విలపిస్తూ.. అమ్మ ఆరోగ్యం కోసం తపించడం చూపరులను కలిచివేస్తోంది. ఆమెకు జతకలిసిన పలువురు అభిమానులు కూడా కంటతడి పెట్టడం కనిపించింది.
చెన్నై అంతటా అమ్మ అభిమానులు పోటెత్తుతుండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. చెన్నైలోని పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వద్ద రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.