జయ ఆరోగ్యంపై అపోలో కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటనను విడుదల చేసింది. జయలలిత కన్నుమూశారంటూ వచ్చిన వందతులు అపోలో ఆస్పత్రి తిరస్కరించింది. జయలలితకు ఇప్పటికీ లైఫ్ సపోర్ట్‌ను కొనసాగిస్తున్నామని, అపోలో, ఎయిమ్స్ వైద్యబృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపింది. జయలలిత చనిపోయారని కొన్ని మీడియా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, ఇవి పూర్తిగా నిరాధార, అసత్య కథనాలు అని అపోలో స్పష్టం చేసింది.
తమ పత్రికా ప్రకటనను చూసైనా మీడియా తన తప్పుడు కథనాలను సరిచేసుకోవాలని హితవు పలికింది. అపోలో చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుబ్బయ్య విశ్వనాథన్ ఈ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న జయలలిత అభిమానులు విజిల్స్ వేస్తూ.. చప్పట్లు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడులో కొంత ఉద్రిక్తత సడలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సగం అవనతం చేసిన జెండా తిరిగి పూర్తిగా ఎగరవేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.