చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్ | AIADMK activists and Jayalalithaa followers protest at apollo hospital | Sakshi
Sakshi News home page

చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్

Published Mon, Dec 5 2016 2:42 AM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్ - Sakshi

చెన్నై అపోలో వద్ద టెన్షన్.. టెన్షన్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండెపోటు వార్త విన్నప్పటి నుంచీ అర్ధారత్రి రెండు గంటలవరకూ 'అమ్మ' జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను స్పెషల్ వార్డు నుంచి ఐసీయూకు షిఫ్ట్ చేసి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని, అమ్మ త్వరలో ఇంటికి వెళ్లిపోతారని ఇటీవల కథనాలు రాగా.. ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

గవర్నర్ మౌనం.. అమ్మ అభిమానుల్లో భయం భయం!
తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబై నుంచి అపోలో ఆస్పత్రికి వచ్చి జయలలిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు ఆస్పత్రిలో ఉన్న గవర్నర్.. మీడియాతో జయ ఆరోగ్యంపై మాట్లాడేందుకు నిరాకరించారు. జయ పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఆమె ఆరోగ్యంపై స్పందించకుండానే రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. రాజ్‌భవన్ నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని జయలలిత అభిమానుల్లో కలవరం మొదలైంది. అర్ధరాత్రి రెండు గంటలు దాటినా ఆస్పత్రి వద్దే ఉండి 'పురచ్చితలైవి అమ్మ..' అంటూ గట్టిగా అరుస్తూ నినాదాలు చేస్తున్నారు.


జయలలిత ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితిపై కచ్చితమైన ప్రకటన చేయాలంటూ అమ్మ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు అమ్మ అమ్మ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందోనని భావించిన కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను రప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను ఆస్పత్రి వద్ద మోహరించింది. ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్ లో ఉన్న వారిని అక్కడినుంచి  సురక్షిత ప్రాంతానికి తరలించారు. 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. టోల్‌ప్లాజాలు, హైవేలపై పోలీసులు బందోబస్తు చేపట్టారు. మండల స్థాయి నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. గత సెప్టెంబర్ 22నుంచి అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement