'అమ్మ'కు సీరియస్ | cm Jayalalithaa suffers with heart attack | Sakshi
Sakshi News home page

'అమ్మ'కు సీరియస్

Published Mon, Dec 5 2016 4:00 AM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

'అమ్మ'కు సీరియస్ - Sakshi

'అమ్మ'కు సీరియస్

  • మళ్లీ ఐసీయూలోకి జయలలిత.. గుండెపోటు వచ్చినట్లు అపోలో ప్రకటన
  • 8 మంది ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స
  • లండన్ వైద్యుడితోనూ సంప్రదింపులు
  • గవర్నర్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్
  • హుటాహుటిన చెన్నైకి విద్యాసాగర్‌రావు
  • అపోలో వైద్య బృందంతో చర్చలు
  • ఆసుపత్రిలోనే కేబినెట్ అత్యవసర భేటీ
  • భారీగా చేరుకున్న అన్నాడీఎంకే శ్రేణులు
  • ఆసుపత్రి పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత
  • తమిళనాడు వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
  • పలు ఆలయాల్లో  ప్రార్థనలు , పూజలు
  • నేడు విద్యాసంస్థలన్నిటికీ సెలవు
  • చెన్నై: రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విషమించింది. గుండెపోటు రావడంతో జయలలితను జనరల్ వార్డు నుంచి ఐసీయూలోకి మార్చినట్లు అపోలో ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రికి ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆమెకు గుండె సంబంధ నిపుణులు, అత్యవసర వైద్య చికిత్సా నిపుణులు చికిత్సనందిస్తూ పర్యవేక్షిస్తున్నారు’’అని ఆదివారం రాత్రి అపోలో హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
     
    జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ నిపుణుల బృందం ధ్రువీకరించినట్లు అన్నాడీఎంకే ప్రకటించిన కొద్ది గంటలకే జయ గుండెపోటుకు గురయ్యారు. జయకు చికిత్స జరుగుతున్న అపోలో అసుపత్రి పరిసరాలలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాపితంగా ఆర్మ్‌డ్, రిజర్వ్ పోలీసులు బలగాలను మోహరించారు. ఆసుపత్రి చుట్టుపక్కల హోటళ్ల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. జయకు గుండెపోటు వార్త గురించి తెలియగానే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయ అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
     
    నేడు ఎయిమ్స్ బృందం రాక
    ఎనిమిది మంది ప్రత్యేక వైద్య నిపుణులతో కూడిన బృందం జయలలితకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి. ఈ బృందం లండన్‌లోని డాక్టర్ రిచర్డ్ బేలీతోనూ సంప్రదింపులు జరుపుతోంది. జయలలితకు చికిత్స అందించడం కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం వస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. జయలలిత ఆరోగ్యం గురించి అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాపరెడ్డితో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాశ్ నద్దా ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. కాగా జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడు మంత్రివర్గం అపోలో ఆసుపత్రిలోనే భేటీ అయింది.
     
    హుటాహుటిన వచ్చిన గవర్నర్
    నేవీడే వేడుకల కోసం ముంబైలో ఉన్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు హుటాహుటిన బయలుదేరి చెన్నై వచ్చారు. ఆయన నేరుగా అపోలో ఆసుపత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడారు. గవర్నర్ వెంట అపోలో చైర్మన్ ప్రతాపరెడ్డి కూడా ఉన్నారు. ఆసుపత్రిలో 10 నిమిషాల సేపు ఉన్న గవర్నర్ ఆ తర్వాత బయటకు వచ్చి రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఆయన ఏమన్నా మాట్లాడతారని బయట విలేకరులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అరుుతే రాజ్‌భవన్‌కు వెళ్లిన తర్వాత గవర్నర్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
     
     ప్రముఖుల ట్వీట్లు
     జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి సహా అనేకమంది ప్రముఖులు ట్వీట్లు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు తదితరులు కూడా ట్వీట్లు చేసినవారిలో ఉన్నారు.
     
    గవర్నర్‌కు రాజ్‌నాథ్ ఫోన్
    అంతకుముందు జయలలితకు గుండెపోటు వార్తల గురించి తెలిసిన వెంటనే తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌చేశారు. జయ ఆరోగ్యం విషయమై వాకబుచేశారు. విద్యాసాగర్‌రావు తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ముంబై నుంచి తాను చెన్నై బయలుదేరి వెళుతున్నట్లు విద్యాసాగరరావు రాజ్‌నాథ్‌కు వివరించారు. రాజ్‌నాథ్‌తో 10 నిమిషాల సేపు ఫోన్‌లో మాట్లాడిన విద్యాసాగరరావు.. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వివరించారు. ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారని తెలిపారు. జయలలిత ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడం కోసం చెన్నై బయల్దేరి వెళుతున్నట్లు విద్యాసాగరరావు హోం మంత్రికి వివరించారని అధికార వర్గాలు తెలిపాయి.
     
    కేంద్ర బలగాలు సిద్ధం..
    తమిళనాడులో పరిస్థితిని మదింపు చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖఅధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతానికి తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి సాధారణంగా ఉందని ఢిల్లీలోని కేంద్ర అధికారవర్గాలంటున్నాయి. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అవసరమైన పక్షంలో సహాయం చేయడానికి తగినన్ని కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి ఏ సహాయం కావాలన్నా అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే రెండు కేంద్ర పారామిలిటరీ బలగాల అధిపతులు సీఆర్‌పీఎఫ్ డీజీ కె. దుర్గాప్రసాద్, సీఐఎస్‌ఎఫ్ డీజీ ఓపీ సింగ్‌లను తమిళనాడుకు పంపిస్తారని, వారు భద్రతా బలగాలను పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
     
    సెప్టెంబర్ 22 నుంచి ఆసుపత్రిలోనే..
    డీహైడ్రేషన్, జ్వరంతో సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరారు. ఇతర సమస్యలతో పాటు శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందిస్తున్నామని అపోలో హాస్పిటల్ వర్గాలు ఆమె ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌‌సలో పేర్కొన్నాయి. శ్వాసకోశ నాళానికి అదనంగా ఒక కవాటాన్ని చేర్చామని, జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని ఆపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. పూర్తి దేహానికి ఫిజియోథెరపీ జరుగుతోందని, అనేక వారాలపాటు మంచానికే పరిమితమైన జయలలిత ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకున్నందున ఎప్పుడు ఇంటికి వెళ్లాలనేది ఆమె ఇష్టమని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.
     
    అమ్మ కోలుకున్నారని ఆనందించిన కాసేపటికే..
    ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఆదివారం నాడు చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఎరుుమ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం జయలలిత పూర్తిగా కోలుకున్నారని ధృవీకరించినట్లు చెప్పారు. ఎరుుమ్స్ వైద్యులు శనివారం ఆసుపత్రికి వచ్చి జయలలితను పరీక్షించి ‘అమ్మ’కోలుకున్నారనే శుభవార్తను తమకు చెప్పారని పొన్నియన్ వివరించారు. జయలలిత ఎక్సర్‌సైజులు చేస్తున్నారని, వైద్యులు ఆమెచేత ఫిజియోథెరపీ చేరుుస్తున్నారని, తనంతట తాను ఆహారం తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో నాయకులకు, అధికారులకు సూచనలిస్తున్నారని తెలిపారు.
     
    ఆందోళనలో తమిళనాడు
    జయ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అమ్మకు ఏమరుు్యందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో అన్నాడిఎంకే శ్రేణులు అపోలో ఆసుపత్రి వైపు తరలి వస్తుండటంతో ఆ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. అన్నాడిఎంకే కార్యకర్తలంతా చెన్నై రోడ్ల మీదకు చేరడంతో రాత్రి పట్టపగలుగా మారింది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమ్మ కోసం ప్రార్థనలు, పూజల్లో నిమగ్నమయ్యారు. ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆదుర్దాతో వాహన చోదకులు పెట్రోల్ బాంక్‌ల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల సూపర్ మార్కెట్లోనూ జనం క్రిక్కిరిశారు. సోమవారం స్కూళ్లు, విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement