తమిళనాడు కేబినెట్ అత్యవసర భేటీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూ విభాగంలోకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అపోలో చైర్మన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఫోన్ చేశారు. జయలలిత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదివరకే జయ ఆరోగ్యంపై తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సీఎం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఆస్పత్రిలోనే రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అమ్మ ఆరోగ్య పరిస్థితి, తదనంతర పరిస్థితులపై పన్నీర్ సెల్వం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆమె అనారోగ్యం నుంచి మళ్లీ కోలుకుంటారని రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పతి వద్ద పారా మిలిటరీ బలగాలు ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. అపోలో ఆస్పత్రి వద్ద అవాంచనీయ ఘటనలు తలెత్తుతాయని భావించిన ఉన్నతాధికారులు అపోలో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.