
సాహితీ సౌరభాలతో రైళ్ల పేర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అవార్డు పొందిన సాహిత్యకారుల పేర్లను రైళ్లకు పెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వేశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాహిత్యకారులు దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారో ఆ ప్రాంతంలో ప్రయాణించే రైళ్లకు వారి పేర్లను పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. తొలుత పశ్చిమబెంగాల్ నుంచి బిహార్‌కు వెళ్లే ఓ రైలుకు రచయిత్రి మహాశ్వేతాదేవీ పేరును పెట్టినట్లు రైల్వేశాఖ అధికారి తెలిపారు.
ఇందుకు సంబంధించి రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అవార్డు పొందిన సాహితీవేత్తల జాబితాను సిద్ధం చేసిందని, రైల్వే జోన్ల వారీగా రైళ్లకు పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్ సర్క్యూట్స్, రైల్వే పథకాల పేర్లను మార్పు చేసింది. నాగ్‌పూర్ –ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ రైల్ పట్టాలు తప్పిన ఘటనలో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి ఎందరో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన రైలు డ్రైవర్లను శనివారం రైల్వేశాఖ ఘనంగా సత్కరించింది.