ప్రత్యేక ఖాతాలో 70% ప్రాజెక్టు వ్యయం డిపాజిట్ చేయాలన్న నిబంధనకు అంగీకారం
కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్మాణ ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని ప్రత్యేక ఎస్క్రొ ఖాతాలో(మూడో వ్యక్తి నియంత్రణలో ఉండే తాత్కాలిక అకౌంట్) డిపాజిట్ చేయాలన్న నిబంధనకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు రియల్ ఎస్టేట్(నియంత్రణ, అభివృద్ధి) బిల్లు, 2015లో సవరణ చేయనున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ బిల్లులో ఈ నిబంధన ఉండాలన్న కాంగ్రెస్, సీపీఎం పార్టీల డిమాండ్‌కు మోదీ ప్రభుత్వం అంగీకరించినట్లైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ రియల్ ఎస్టేట్ బిల్లులోని ఈ ప్రతిపాదనతో పాటు పలు ఇతర ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకత, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కచ్చితత్వం, వివాదాల పరిష్కారాల్లో వేగం.. మొదలైనవి లక్ష్యాలుగా ఈ ‘రియల్’ బిల్లును రూపొందించారు.
ఎస్క్రొ అకౌంట్లో కనీసం 50% ప్రాజెక్టు వ్యయాన్ని డిపాజిట్ చేయాలన్న రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫారసు చేయగా, 70% ప్రాజెక్టు వ్యయాన్ని డిపాజిట్ చేయాలని కేబినెట్ నిర్ణయించడం విశేషం. కాంగ్రెస్ డిమాండ్ నెరవేరినందున ఈ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. నిర్మాణ రంగంలోకి దేశీ, విదేశీ నిధులు తరలివచ్చేందుకు అవకాశం కల్పించే పలు ప్రతిపాదనలకు ఈ బిల్లులో స్థానం కల్పించారు. పెరిగిన ప్రైవేటు భాగస్వామ్యంతో ‘అందరికీ ఇల్లు’ అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు కూడా ఇది దోహదపడుతుంది. గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ బిల్లులో సవరణలను రూపొందించారు. కనీసం 500 చదరపు మీటర్లు లేదా 8 ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను నిర్మాణ రంగ నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకోవాలన్న ప్రతిపాదన కూడా వాటిలో ఒకటి. గతంలో ఇది వెయ్యి చదరపు మీటర్లు లేదా 12 ఫ్లాట్లుగా ఉండేది. ఈ నిబంధన వల్ల కొనుగోలుదారులకు రక్షణ లభిస్తుంది. ఈ బిల్లు ద్వారా రియల్ ఎస్టేట్ రంగ ఏకీకృత నియంత్రణకు అవకాశం లభిస్తుంది.
హ్యాపీనే కానీ..
రియల్ ఎస్టేట్ నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిర్మాణ రంగ పరిశ్రమ స్వాగతించింది. అయితే, ప్రతిపాదిత చట్టంలో నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అనుమతులను ఇచ్చే ప్రభుత్వ విభాగాలను కూడా భాగస్వాములను చేయాలని డిమాండ్ చేసింది. ‘బిల్లులోని కొన్ని సమస్యలను పరిష్కరించాలి. లేదంటే ప్రాజెక్టు పూర్తి కావడంలో మరింత జాప్యం జరిగే అవకాశముంది’ అని క్రెడాయి అధ్యక్షుడు గెతంబర్ ఆనంద్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు ఈ ప్రతిపాదిత చట్టాన్ని వర్తింపచేయకూడదని సూచించారు. ఈ చట్టంతో రియల్ రంగంలో పారదర్శకతకు వీలవుతుందని నేరిడ్కో అధ్యక్షుడు ప్రవీణ్ జైన్ పేర్కొన్నారు.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
-
పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో 1.5 లక్షల టన్నులతో ఈ ఏడాదే ఒక ఆపద్ధర్మ నిల్వ(బఫర్ స్టాక్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పు ధాన్యాల రిటైల్ రేట్లను నియంత్రణలో ఉంచేందుకు ఈ బఫర్ స్టాక్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైతే, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు కూడా సీసీఈఏ అనుమతించింది.
-
ఆహార ధాన్యాలు, పంచదారను ప్యాక్ చేసేందుకు జనపనార బస్తాలను ఉపయోగించాలి. ఈ నిర్ణయం వల్ల 3.7 లక్షల జౌళి మిల్లు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.
- అదనంగా 106 అంతర్గత జల రవాణా మార్గాలకు జాతీయ జల రవాణా మార్గాలుగా మార్చేందుకు చట్టం చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. జాతీయ జలరవాణా మార్గాల బిల్లు-2015లో అధికారిక సవరణలకు అంగీకారం.
-
బిల్లులోని ముఖ్యాంశాలు...
-
వాణిజ్య, గృహ సంబంధ ప్రాజెక్టులకు ఈ బిల్లు వర్తిస్తుంది.
-
రియల్ రంగ లావాదేవీల నియంత్రణ కోసం రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ వద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు రిజిస్టర్ చేసుకోవాలి.
- {పాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడి చేయాలి. వాటిలో ప్రమోటర్ వివరాలు, లేఔట్ ప్లాన్, భూమి స్థితి, అనుమతులు, ఒప్పందాలు, ఏజెంట్లు, కాంట్రాక్టర్ల వివరాలు ఉండాలి.
- అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్ల వరకు, ఏజెంట్లకు ఏడాది వరకు జైలుశిక్ష
-
అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా కేసును పరిష్కరించాలి. నియంత్రణ సంస్థలు ఫిర్యాదులను రెండు నెలల్లోగా పరిష్కరించాలి.