‘మే 1నుంచి రియల్ ఎస్టేట్ చట్టం’
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ చట్టాన్ని 2008లో తెరమీదకు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. అలాగే, ఇక నుంచి బిల్డర్లు తాము చేయబోయే నిర్మాణాల గురించి ముందుగా ఏం పేర్కొన్నారో, మీడియాలో, పుస్తకాల్లో, ప్రకటనల్లో ఎలాంటి అంశాలు చెప్పారో వాటన్నింటిని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుందని, వాటిని పాటించాలని సూచించారు.
లేదంటే దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. మే 1వరకు కూడా తాము నిర్మించబోయే, నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్ పొందనివారు మూడు నెలల్లో పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, ట్రిపుల్ తలాక్ అంశంపై మాట్లాడుతూ షరియత్ ట్రిపుల్ తలాక్‌ను అనుమతించలేదని చెప్పారు. అన్ని పార్టీలు దీనిపై రాజకీయాలు మానుకొని సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నించాలని కోరారు.