దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’ | Riaz ahmed saidi being investigated on Dilsukhnagar blasting | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’

Published Wed, Feb 18 2015 10:16 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’ - Sakshi

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’

* పేలుడు పదార్థం సరఫరాదారు అతనే..
* మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా
రెండు కేసుల్లోనూ నిందితులుగా అఫాఖీ, సద్దాం
* రియాజ్ అహ్మద్ సయీదీ పాత్రపై  సాగుతున్న దర్యాప్తు

 
 బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్:  హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లకు వాడిన పేలుడు పదార్థాన్ని ఉగ్రవాది హడ్డీకి మంగుళూరులో అందించింది ఎవరో నిగ్గుతేలింది. బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మా డ్యుల్ చీఫ్, హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీనే దీన్ని సరఫరా చేసినట్లు బయటపడింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన అఫాఖీ ఆ ప్రాంతంతోపాటు బెంగళూరులో నూ హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడు. స్థానికులకు డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడైన అఫాఖీ పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు పని చేస్తున్నాడు. గత నెల 8న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు ఇతడితోపాటు భత్కల్ ప్రాంతానికే చెం దిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్‌లను, 10న రియాజ్ అహ్మద్ సయీదీలను అరెస్టు చేశారు.
 
 వీరి విచారణలోనే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లో తలదాచుకుంటున్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, పాక్ జాతీయుడైన జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను మంగుళూరుకు పంపి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. దీంతో అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్థులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పాయింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ పేర్లతో ఉన్న సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌తో అతడి ఈ-మెయిల్ ఐడీ (patarasingh@yahoo.com)కి చాటింగ్  ద్వారా సంప్రదింపులు జరిపేవాడు.
 
 ఎజాజ్‌తో నగదు.. అఫాఖీతో ఎక్స్‌ప్లోజివ్

 రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగావాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. ఇందుకోసం రూ.6.8 లక్షలు హడ్డీకి అందించే బాధ్యతల్ని మహారాష్ట్రలోని పుణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎజాజ్ షేక్‌కు, పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ఔట్‌లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్‌డాంగ్ దుకాణం యజమాని ద్వారా హడ్డీకి నగదు పంపాడు. మిగిలిన ఉగ్రవాదులు మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు.

పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న మంగుళూరు వెళ్లాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి అందిస్తాడని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్ ద్వారా 25 కేజీల పేలుడు పదార్థం (అమ్మోనియం నైట్రేట్), 30 డిటోనేటర్లు సమీకరించిన అఫాఖీ వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో తీసుకువచ్చి యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హడ్డీకి అప్పగించాడు. ఇతడీ పేలుడు పదార్థాన్ని సద్దాం హుస్సేన్ ద్వారా సేకరించినట్లు వెలుగులోకి వచ్చింది.
 
 ఒకరికొకరు తెలియకుండా...

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో పాలుపంచుకున్న యాసీన్ భత్కల్  (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ-1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీ (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు)లకు ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), అఫాఖీలు ఒకరికొకరు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. అఫాఖీ, ఎజాజ్ షేక్‌లకూ ఎలాంటి పరిచయం లేదని, హడ్డీకి పేలుడు పదార్థాలు ఇచ్చినప్పుడు అతడు ఎవరనేది అఫాఖీకి తెలియదని సీసీబీ చీఫ్‌గా ఉన్న బెంగళూరు క్రైమ్స్ డీసీపీ అభిషేక్ గోయల్ ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం యాసీన్, తెహసీన్, హడ్డీ, వఖాస్‌లు హైదరాబాద్ జైల్లో ఉండగా... ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగళూరు జైళ్లల్లో ఉన్నారు. వీరిని న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్ తరలించేందుకు ఎన్‌ఐఏ సన్నాహాలు చేస్తోంది. అఫాఖీ, సద్దాం కూడా దిల్‌సుఖ్‌నగర్  కేసుల్లో నిందితులుగా మారడంతో పరారీలో ఉన్న భత్కల్ సహా  నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు తయారీ  సర్క్యూట్స్‌ను సయీదీ అందించినట్లు అనుమానించి పోలీసులు  ఆరా తీస్తున్నారు.

బెంగళూరు నుంచి 'సాక్షి' ప్రత్యేక ప్రతినిధి కామేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement