asadullah
-
మట్కా డాన్ అసదుల్లా అరెస్ట్
కర్నూలు: శాంతి భద్రతలనే శాసిస్తున్న అక్రమార్కుల ఆట కట్టించే క్రమంలో మట్కా, గుట్కా మాఫియాలపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా పోలీసు బాస్ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగానే పక్కా ఆధారాలతో కర్నూలు నగరం బుధవారపేటలో మట్కా డాన్ అసదుల్లాతో కలిపి 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు పోలీసు శాఖలో ప్రకంపనలకు కేంద్ర బిందువు అయ్యింది. అసదుల్లాపై ఇప్పటివరకు సుమారు 30కి పైగా మట్కా కేసులు నమోదయ్యాయి. ఎస్పీ రఘురామిరెడ్డి హయాంలో జిల్లా నుంచి బహిష్కరించడంతో కొంతకాలం గుంతకల్లు, మరికొంతకాలం హైదరాబాదుకు మకాం మార్చాడు. ఆయన బదిలీపై వెళ్లగానే కర్నూలు చేరుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వారం క్రితం క్రైం పార్టీ పోలీసులు అసదుల్లా ఇంటిపై దాడి చేసి 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఉంచి వాస్తవాలను రాబట్టారు. అయితే అసదుల్లా కుటుంబానికి అధికార పార్టీ ‘పెద్ద’ అండ ఉండటం, ఆయన కుమారుడు అబ్బాస్ టీడీపీ నగర కార్యదర్శిగా కొనసాగుతుండటంతో పోలీసు అధికారులతో రాయబారం చేసి మట్కా కేసు నుంచి విముక్తి కల్పించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓ మంత్రి ద్వారా సిఫారసు చేయించి కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నతాధికారి ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసదుల్లాను అరెస్టు చూపారు. తన కుమారుడిని అరెస్టు చేసే అవకాశం ఏర్పడితే ఇంతకాలం సహకరించిన పోలీసు అధికారుల పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని మట్కా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఒకరు బెదిరింపులకు దిగినట్లు చర్చ నడుస్తోంది. అసదుల్లా ఇంటిపై పోలీసులు దాడి జరిపిన రోజు నుంచి అబ్బాస్ అజ్ఞాతంలో ఉండి నగరంలోని ‘నక్షత్రాల’ హోటల్లో ఉంటూ అధికార పార్టీ నేత అండతో కేసు నుంచి బయట పడినట్లు చర్చ జరుగుతోంది. మట్కా మామూళ్ల గుట్టు రట్టు.. కర్నూలులో మట్కా ప్రధాన నిర్వాహకుడు అసదుల్లాతో పాటు కిందిస్థాయి వారు 8 మంది క్రైం పార్టీ పోలీసులకు దొరకడంతో విచారణలో అనేక నిజాలు బయటపడ్డాయి. మట్కాలో పోలీసు శాఖకు చెందిన కొందరి పాత్రపై పక్కాగా ఆధారాలు వెలుగు చూశాయన్నది విశ్వసనీయ వర్గాల వాదన. పోలీసులు కొందరు సహకరించిన తీరును మట్కా నిర్వాహకులు విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. మామూళ్ల చిట్టాను కూడా విప్పినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయిన వివరాల నుంచి ఎవరెవరికి ఎంత ముట్టజెప్పారన్న రిజిస్టర్ జాబితా వరకు అనేక రకాల సమాచారం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడినా అందులో సగం మాత్రమే రికార్డెడ్‌గా చూపించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంజాయి కేసు నమోదు.. మట్కా నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన వారికి పొట్లాల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో బయట పడటంతో అసదుల్లాతో కలిపి తొమ్మిది మందిపై మట్కాతో పాటు గంజాయి కేసు నమోదు చేసినట్లు కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కటకటాలకు పంపినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన టి.లక్ష్మినారాయణ, ప్రదీప్, బి.మధు, ప్రకాష్‌నగర్‌కు చెందిన షేక్షావలి, కొత్తపేటకు చెందిన ఎం.డి.వలి బాషా, బళ్లారి పట్టణానికి చెందిన సి.శ్రీనివాసులు, గుత్తి కోటా వీధికి చెందిన ఎస్.బాషా, మద్దికెర పట్టణం రామాలయం వీధికి చెందిన ప్రభాకర్ తదితరులతో కలసి అసదుల్లా బుధవారపేటలోని జంగాల కుళ్లాయప్ప ఇంట్లో మట్కా నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు, 11.5 కేజీల గంజాయి, ప్రింటర్, 12 కాలిక్యులేటర్లు, రెండు 4జి హాట్‌స్పాట్స్‌తో పాటు మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సీఐలు హనుమంతు నాయక్, దివాకర్‌రెడ్డి, ఎస్ఐ తిరుపాలు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
అఫ్గాన్‌లో ‘ట్రంప్’కు కష్టాలు
కాబూల్: సాధారణంగా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన, నచ్చిన పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అయితే ఆ పేర్లు కొంచెం విచిత్రంగా ఉంటేమాత్రం అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన సయ్యద్ అసదుల్లాహ్, జమీలా దంపతులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే 2016లో పుట్టిన తమ రెండో కుమారుడికి వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. అయితే చిన్నారి ట్రంప్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తులెవరో ఫేస్బుక్లో పోస్ట్‌చేయడంతో అసలు వివాదం రాజుకుంది. ముస్లింపేరు పెట్టకపోవడంతో అసదుల్లాహ్ను చంపేస్తామని కొంతమంది ఫేస్బుక్లో హెచ్చరించగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టేవారు. ఈ బాధ తట్టుకోలేక ఆయన ఫేస్బుక్ ఖాతాను క్లోజ్ చేశారు. ఇరుగుపొరుగువారు కూడా వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అసదుల్లాహ్ను బెదిరించసాగారు. దీంతో ఆయన స్వస్థలమైన డైకుండీ ప్రావిన్సును వదిలి కాబూల్‌కు వలస వచ్చారు. ఈ విషయమై అసదుల్లాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్ రాసిన ‘హౌ టు గెట్ రిచ్’ పర్షియన్ అనువాదాన్ని చదవడంతో పాటు చాలా పరిశోధన చేసిన తర్వాతే తన కుమారుడికి ట్రంప్ అని పేరుపెట్టినట్లు తెలిపారు. -
ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవోగా అసదుల్లా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందిస్తున్న ఏపీ వక్ఫ్‌బోర్డు ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా డిప్యూటీ కలెక్టర్ ఎండి.అసదుల్లాను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న సుల్తాన్ మోహియొద్దీన్‌ను రిలీవ్ చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’
* పేలుడు పదార్థం సరఫరాదారు అతనే.. * మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా * రెండు కేసుల్లోనూ నిందితులుగా అఫాఖీ, సద్దాం * రియాజ్ అహ్మద్ సయీదీ పాత్రపై సాగుతున్న దర్యాప్తు బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లకు వాడిన పేలుడు పదార్థాన్ని ఉగ్రవాది హడ్డీకి మంగుళూరులో అందించింది ఎవరో నిగ్గుతేలింది. బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మా డ్యుల్ చీఫ్, హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీనే దీన్ని సరఫరా చేసినట్లు బయటపడింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన అఫాఖీ ఆ ప్రాంతంతోపాటు బెంగళూరులో నూ హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడు. స్థానికులకు డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడైన అఫాఖీ పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు పని చేస్తున్నాడు. గత నెల 8న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు ఇతడితోపాటు భత్కల్ ప్రాంతానికే చెం దిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లను, 10న రియాజ్ అహ్మద్ సయీదీలను అరెస్టు చేశారు. వీరి విచారణలోనే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లో తలదాచుకుంటున్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, పాక్ జాతీయుడైన జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను మంగుళూరుకు పంపి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. దీంతో అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్థులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పాయింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ పేర్లతో ఉన్న సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌తో అతడి ఈ-మెయిల్ ఐడీ (patarasingh@yahoo.com)కి చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎజాజ్‌తో నగదు.. అఫాఖీతో ఎక్స్‌ప్లోజివ్ రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగావాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. ఇందుకోసం రూ.6.8 లక్షలు హడ్డీకి అందించే బాధ్యతల్ని మహారాష్ట్రలోని పుణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎజాజ్ షేక్‌కు, పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్‌డాంగ్ దుకాణం యజమాని ద్వారా హడ్డీకి నగదు పంపాడు. మిగిలిన ఉగ్రవాదులు మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న మంగుళూరు వెళ్లాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి అందిస్తాడని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్ ద్వారా 25 కేజీల పేలుడు పదార్థం (అమ్మోనియం నైట్రేట్), 30 డిటోనేటర్లు సమీకరించిన అఫాఖీ వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో తీసుకువచ్చి యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హడ్డీకి అప్పగించాడు. ఇతడీ పేలుడు పదార్థాన్ని సద్దాం హుస్సేన్ ద్వారా సేకరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఒకరికొకరు తెలియకుండా... దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలుపంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ-1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీ (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు)లకు ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), అఫాఖీలు ఒకరికొకరు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. అఫాఖీ, ఎజాజ్ షేక్లకూ ఎలాంటి పరిచయం లేదని, హడ్డీకి పేలుడు పదార్థాలు ఇచ్చినప్పుడు అతడు ఎవరనేది అఫాఖీకి తెలియదని సీసీబీ చీఫ్‌గా ఉన్న బెంగళూరు క్రైమ్స్ డీసీపీ అభిషేక్ గోయల్ ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం యాసీన్, తెహసీన్, హడ్డీ, వఖాస్‌లు హైదరాబాద్ జైల్లో ఉండగా... ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగళూరు జైళ్లల్లో ఉన్నారు. వీరిని న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్ తరలించేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. అఫాఖీ, సద్దాం కూడా దిల్సుఖ్నగర్ కేసుల్లో నిందితులుగా మారడంతో పరారీలో ఉన్న భత్కల్ సహా నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు తయారీ సర్క్యూట్స్‌ను సయీదీ అందించినట్లు అనుమానించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు నుంచి 'సాక్షి' ప్రత్యేక ప్రతినిధి కామేష్