తొలిసారి కేంద్ర మంత్రిగా సాధ్వీ నిరంజన్ జ్యోతి
న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికైన సాధ్వీ నిరంజన్ జ్యోతికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఏప్రిల్ -మే నెలల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫతేపుర్ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ఆమె ఆదివారం సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీ పెద్దలు నిరంజన్ జ్యోతికి స్థానం కల్పించారు. ఉత్తరప్రదేశ్ లో దళిత ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నిరంజన్ జ్యోతికి సహాయమంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. గత 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్ హమిర్ పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభకు ఎన్నికైన ఆమె కేంద్ర మంత్రి పదవిని కూడా చేజిక్కించుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు.
రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు మొత్తం 21 మంది చేత కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో నలుగురు కేబినెట్ మంత్రులు కాగా, ముగ్గురు స్వతంత్ర హోదా గల మంత్రులు, మరో 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోడీ కేబినెట్ లో మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 66 కు చేరింది.