మోదీ విధేయుడికి మంత్రి పదవి
బీహార్ కు చెందిన వివాదస్పద నాయకుడు గిరిరాజ్ సింగ్- నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ పదవి పొందారు. బీహార్ నుంచి కేంద్ర కేబినెట్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఆయనకు స్థానం కల్పించారు. నవాడా లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిన దాఖలాలున్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైయ్యాయి. నరేంద్ర మోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు.
ప్రధాని అభ్యర్థిగా మోదీని ముందుగా సమర్థించిన వారిలో గిరిరాజ్ ఒకరు. మోదీ పట్ల చూపిన విధేయతకు ఆయనకు ఫలితం దక్కింది. నవాడా నుంచి పోటీ చేసేందుకు గిరిరాజ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తాను సురక్షితంగా భావించే బెగుసరాయ్ స్థానం కాదని నవాడా సీటు కేటాయిండంతో అయిష్టత ప్రదర్శించారు. దీంతో మోదీ స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా గిరిరాజ్ ను నవాడా సేవకుడుగా పేర్కొన్నారు.
వ్యవసాయం, పశుసంవర్థకం గిరిరాజ్ కు ఇష్టమైన అంశాలు. బీహార్ శాసనమండలిలో సభ్యుడిగా, నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూమిహార్ ప్రాంతంలో గిరిరాజ్ ప్రభావం చూపుతారని బీజేపీ అంచనా వేస్తోంది.