మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!
కల్నల్ రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన 44 ఏళ్ల రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడం విశేషం.
బికనీర్ లోని రాజ్ఫుత్ వంశానికి చెందిన రాజ్యవర్థన్ 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్- కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు. పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్- ఇప్పుడు దేశానికి మంత్రి అయ్యారు.