న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్ రాథోడ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. ఫోన్ నిజంగా హ్యాకింగ్ అయ్యిందని రాహుల్ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో చట్టవిరుద్ధంగా ఎవరి ఫోన్‌నూ హ్యాక్ చేయడం లేదని తేల్చిచెప్పారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఒక జూనియర్ కాపీ రైటర్ కూడా రాహుల్ గాంధీ ఫోన్‌లోని కంటెంట్‌ను కాపీ చేయాలని కోరుకోడని రాజ్యవర్దన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది ముమ్మాటికీ రాజద్రోహమేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బాధ్యతారాహితంగా మాట్లాడుతున్నారని రాజ్యవర్దన్ రాథోడ్ మండిపడ్డారు. ఆయన తన ఫోన్‌ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఫోన్ల హ్యాకింగ్ జరుగుతోందని భావిస్తే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment