విజయ్‌చౌక్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. వాస్తవం చెప్పాలంటే దేశంలోని 60 శాతం ప్రజల దృష్టిలో అసలు పార్లమెంటు సమావేశాలే జరగలేదు. దేశంలో 60 శాతం ప్రజల గొంతును నొక్కేశారు. అవమానించారు. బుధవారం రాజ్యసభలో భౌతికదాడులు చేశారు. పెగసస్ అంశంపై చర్చించాలని అడిగితే ప్రభుత్వం నిరాకరించింది. రైతుల సమస్యలను మేం పార్లమెంటు వెలుపల లేవనెత్తాం. ఎందుకంటే మేం సభలోపల లేవనెత్తలేకపోయాం.
పెగసస్ అంశాన్ని కూడా పార్లమెంటు వెలుపలే లేవనెత్తాం. అది కూడా పార్లమెంటులో లేవనెత్తలేకపోయాం. పార్లమెంటులో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు కాబట్టి ఈరోజు మీ (మీడియా) ముందుకు వచ్చాం. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కంటే ఇది తక్కువ కాదు’ అని రాహుల్ అన్నారు. ‘రాజ్యసభలో తొలిసారి సభ్యులపై దాడి చేశారు. బయటి నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భౌతిక దాడులు చేయించారు. రాజ్యసభ ఛైర్మన్ కంట తడి పెట్టారని మీడియా అంటోంది.
ఆయన బాధ్యత ఏంటి? సభను నడిపించడం. ఇన్ని రోజులు ఎందుకు నడిపించలేకపోయారు? సభాపతి ఎందుకు నిర్వహించలేకపోయారు? విపక్షాల వాణిని ఎందుకు విననివ్వలేదు? మీకు, దేశానికి చెప్పదలుచుకున్నా. సభలో విపక్షాలను ఎవరు, ఏరకంగా ఆపుతున్నారు? ఈరోజు మీ ఫోన్‌లో పెగసస్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఈ దేశ ప్రధాని దేశాన్ని అమ్మేసే పనిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు ఈ దేశ ఆత్మను అమ్మేస్తున్నారు. అందుకే విపక్షాలను సభలో రైతుల గురించి గానీ, నిరుద్యోగుల గురించి గానీ, ఇన్సూరెన్స్ బిల్లు గురించి గానీ, పెగసస్ గురించి గానీ మాట్లాడనివ్వడం లేదు. ఇది వాస్తవం. దేశ ప్రధాన మంత్రి దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment