న్యూఢిల్లీ: దేశంలో యువతీ యువకులందరి ఫోన్లలో పెగసస్ స్పైవేర్‌ను అమర్చారని, తద్వారా వారి గొంతులను అణచివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్ ఘెరావ్’ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం యువతకు ఉద్యోగాలు రావని, ఉపాధి లభించదని అన్నారు. మోదీ కేవలం బడా బాబులు, బడా పారిశ్రామికవేత్తలతోనే స్నేహం చేస్తున్నారని, పేదలు, యువతకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. బడుగులతో ఆయనకు ఎలాంటి బాంధవ్యం లేదన్నారు. పెగసస్ వివాదం చిన్న అంశమని కేంద్ర సర్కారు కొట్టిపారేయడం పట్ల రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్న అంశమైతే ప్రతిపక్షాలన్నీ కలిసి దీనిపై ఎందుకు స్పందిస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘మీ మొబైల్ ఫోన్ మీ గొంతుకలాంటిది. కేవలం నా ఫోన్‌లోనే కాదు, మొత్తం యువత ఫోన్లలో పెగసస్ స్పైవేర్‌ను నిక్షిప్తం చేశారు. నిజాలు మాట్లాడకుండా కట్టడి చేయాలన్నదే ప్రధానమంత్రి కుతంత్రం’’ అని ధ్వజమెత్తారు. నిజానికి దేశంలో యువత గొంతులను ఎవరూ అణచివేయలేరని తేల్చిచెప్పారు. ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా లేనివారందరినీ ఏకం చేయాలని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో యువత తమ స్వరాన్ని పెంచాలని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న వారి పక్షాన గొంతు వినిపించాలని పేర్కొన్నారు. మోదీ సర్కారు కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని రాహుల్ మండిపడ్డారు. దేశంలో హమ్ దో, హమారే దో (మేమిద్దరం.. మాకిద్దరు) సర్కారు పాలన సాగిస్తోందని పరోక్షంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
నేడు జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్షాల నిరసన!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment