ఢిల్లీలో దుమ్ముదుమారం | Sand cyclone in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దుమ్ముదుమారం

Published Sat, May 31 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

ఢిల్లీలో దుమ్ముదుమారం

ఢిల్లీలో దుమ్ముదుమారం

 ప్రచండ వేగంతో ఈదురుగాలులు.. స్తంభించిన జనజీవనం
 వివిధ ఘటనల్లో 9 మంది మృతి; 13 మందికి పైగా గాయాలు

 
 సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రమైన గాలిదుమారం శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో బీభత్సం సృష్టించింది.ప్రచండమైన వేగంతో వీచిన ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. చెట్లు విరిగిపడటం, గోడలు కూలడం, విద్యుదాఘాతం లాంటి వివిధ ఘటనల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. 13 మందికి పైగా గాయాలపాలయ్యారు. నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దాదాపు గంట పాటు నగర వాసులకు నరకం చూపించి అనంతరం వాతావరణం ప్రశాంతమైంది.  సాయంత్రం 4.58 గంటలకు ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఉరుములు, దాదాపు గంటకు 90 కి..మీల వేగంతో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఆకాశాన్ని దుమ్ము, దూళి రేణువులు కమ్మేసి, సాయంత్రానికే చీకట్లు అలముకున్న పరిస్థితి నెలకొంది. ఈదురుగాలుల ప్రభావానికి పలు వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలపై కూడా దీని ప్రభావం పడింది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా అయ్యే ఉత్తర గ్రిడ్‌కు చెందిన ముఖ్యమైన సరఫరా లైన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో దాదాపు నగరవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలముకుంది.
 
 దాదాపు  గంటపాటు మెట్రో రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం కావడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు సహా వేలాది మంది ప్రయాణీకులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దాదాపు 18 దేశీయ, ఒక అంతర్జాతీయ విమానాలను సమీపంలోని ఎయిర్‌పోర్టులకు దారిమళ్లించారు. దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్), నోయిడా, ఘజియాబాద్‌ల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. దీనికి క్యుములో నింబస్ వాతావరణ పరిస్థితుల కారణమని, మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
 శీతల పవనాలు, వేడి గాలుల కలయికతో అల్ప పీడనం ఏర్పడి ఇలాంటి ‘పశ్చిమ అస్థిరత’ ఏర్పడుతుందని వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్‌ఎస్ రాథోర్ వివరించారు. ప్రస్తుతం ఈ క్యుములోనింబస్ స్థితి పాకిస్తాన్‌పై కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. దీని ప్రభావం వల్ల విపరీతమైన వేగంతో గాలులు వీచి, అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నమంతా దాదాపు 42.8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.
 
 గాలుల ప్రభావానికి తెగిపడిన టిన్ షీట్ గొంతు దగ్గర కోసుకుపోవడంతో అను(17) అనే యువకుడు మరణించాడు. అతని తల్లి తీవ్రంగా గాయపడింది. తూర్పు ఢిల్లీలో గోడ కూలడంతో ఐదుగురు గాయాల పాలయ్యారు. దక్షిణ ఢిల్లీలో మరో ఇద్దరు మరణించారు. గోడ కూలి మీద పడటంతో ఆషా మాలిక్ అనే విద్యార్థిని మరణించింది. చెట్టు కూలి మీద పడ్డ ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. భారీ వృక్షాలు కూలి, పైన పడటంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇంటి పై కప్పు కూలిపోయిన ఘటనలో ఒకరు చనిపోగా, 8 మంది గాయాలపాలయ్యారు. భారీ ట్రాఫిక్ సైన్ బోర్డ్ మీదపడిన ఘటనలో కవిత అనే యువతి చనిపోయింది. ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement