‘సరస్వతి’ నిజంగానే ఉండేది
తేల్చిన వాల్దియా కమిటీ
- మళ్లీ పారించే అంశాన్ని పరిశీలిస్తాం: ఉమా భారతి
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పురాణాలలోనిదిగా భావించిన సరస్వతి నది ఒకప్పుడు భూమిపై నిజంగానే ప్రవహించిందని ప్రభుత్వం నియమించిన వాల్దియా కమిటీ తేల్చింది. కమిటీ తన నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి సమర్పించింది. నది ఉన్నట్లు తేల్చినందుకు కమిటీని ఆమె ప్రశంసిస్తూ నివేదికలోని విషయాన్ని తోసిపుచ్చలేమనీ, అలాగే తాము దీన్ని ఇంకా ఆమోదించలేదని అన్నారు. నిపుణులతో చర్చించి, త్వరలోనే కేబినెట్ ముందుకు నివేదికను తీసుకొస్తామన్నారు. పాలియోచానెల్(నది ఒకప్పుడు ప్రవహించి, తన దిశను మార్చుకున్నపుడు వట్టిగా మిగిలిపోయిన ప్రాంతాలు)లో పెద్దమొత్తంలో స్వచ్ఛమైన నీరు ఉందని, దాన్ని వెలికితీసి కరువు ప్రాంతాలదాహం తీర్చాలని వాల్దియా అన్నారు. కృత్రిమ పద్ధతుల్లో నదిని మళ్లీ పారించే అంశాన్ని పరిశీలిస్తామని ఉమ చెప్పారు.
నది సాగిన మార్గమిది
ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీకి నాయకత్వం వహించిన భూగర్భ శాస్త్రజ్ఞుడు కేఎస్ వాల్దియా, 6 నెలల తమ పరిశోధన గురించి వివరించారు. ‘సరస్వతి హిమాలయాల్లో పుట్టి గుజరాత్‌లోని గల్ఫ్ (భూభాగంలోకి చొచ్చుకుని వచ్చినట్లు ఉండే చిన్న సముద్రభాగం) వద్ద అరేబియా సముద్రంలో కలిసేది. సముద్రంలోకి చేరేముందు పాకిస్తాన్‌లోని రాన్ ఆఫ్ కచ్ గుండా ప్రవహించేది. పొడవు 4 వేల కి.మీ. నది మూడింట ఒక వంతు ప్రస్తుత పాక్‌లో, రెండొంతులు భారత్‌లో ప్రవహించేది.
నది రెండు శాఖలు (పశ్చిమ, తూర్పు)గా విడిపోయి ప్రవహించేది. శాఖలు పంజాబ్‌లోని షూత్రణ వద్ద మళ్లీ కలిసేవి. తర్వతా రాన్ ఆఫ్ కచ్ ను దాటి వెళ్లి అరేబియా సముద్రంలో నది కలిసేది.హరప్పా నాగరికత కాలంలో పాలియోచానెల్ తీరంలో 1,700 చిన్న, పెద్ద గ్రామాలు ఉండేవి. ఇవి 5,500 సంవత్సరాలపాటు ఉనికిలో ఉన్నాయి. నీళ్లు లేకుండానే అక్కడి ప్రజలంతా అన్నేళ్లు బతికి ఉండరు. పారే పెద్ద నదే వారికి జీవనాధారం అయ్యుంటుంది. అయితే అది ఏ నది అనేది కనుక్కొడానికి మేం పరిశోధనలు చేసి సరస్వతి అని గుర్తించాం’ అని తెలిపారు.