న్యూఢిల్లీ: సంచలన నిఠారి హత్యకేసులో దోషి సురేందర్ కోలికి మరణశిక్షను తగ్గిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించి ముద్దాయి సురేందర్ కొలికి ఉన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సురేందర్ కోలికి, మరొకరికి ఉరి తప్పదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన ముద్దాయి సురేందర్ కోలీ, అతనికి సహకరించిన మణీందర్ సింగ్ పంథర్‌లకు 2006లో ఘజియాబాద్ సిబీఐ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.
అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పెట్టుకున్న మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ముద్దాయి సురేందర్ కోలి మరణశిక్షను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టులో పియూడీర్ అనే స్వచ్ఛంద సంస్థ పిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు కు ఇది విరుద్ధమని వాదించింది. దీనికి స్పందించిన కోర్టు మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పుచెప్పింది.
కాగా ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో భాగంగా ఒక బాలిక కేసులో మాత్రమే ఘజియాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ కోలీ నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెల్సిందే.