ఏటీఎం వ్యాన్లో రూ. 2 కోట్లు చోరీ!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పట్టపగలే ఘోరం జరిగింది. ఏటీఎం సెంటర్లలో నగదు పెట్టడానికి వెళ్తున్న వ్యాన్ను సెక్యూరిటీ గార్డే దోచుకున్నాడు. వేలు కాదు.. లక్షలు కాదు... ఏకంగా రూ. 2 కోట్లు ఎత్తుకెళ్లిపోయాడు. ఈ చోరీకి పాల్పడిన నలుగురిలో ఒకరు సెక్యూరిటీ సంస్థ ఉద్యోగేనని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సద్రే ఆలమ్తో పాటు అతడి ముగ్గురు సహచరుల కోసం గాలింపు జరుపుతున్నామన్నారు.
సెక్యూరిటీ వ్యానులో రూ. 2 కోట్లు పెట్టుకుని, ఆ సొమ్మును ముంబై శివార్లలోని వివిధ ఏటీఎం సెంటర్లలో పెట్టేందుకు బయల్దేరారు. అందులో నలుగురు ఉన్నారు. వాళ్లలో ఆలం కూడా ఒకరు. అతడు కాసేపు వ్యాన్ ఆపమని చెప్పి.. మిగిలినవాళ్లకు టీ తెచ్చాడు. అయితే అందులో మత్తుమందు కలిపి ఉన్న విషయం తెలియక వాళ్లు ఆ టీ తాగేశారు. వ్యాన్ కొద్ది దూరం వెళ్లేసరికల్లా మిగిలినవాళ్లంతా మత్తులో మునిగిపోయారు. సరిగ్గా అప్పుడే వ్యాను ముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగారు. వాళ్లంతా ఆలంతో కలిసి సెక్యూరిటీ లాకర్ తెరిచి, అందులోని నగదు మొత్తాన్ని తీసుకుని అక్కడినుంచి తమ కారులో ఉడాయించారు.