
అర్ధనగ్న పెయింటింగ్స్.. రచ్చరచ్చ
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శన రసాభాసగా మారింది. అర్థనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారని కొంతమంది వ్యక్తులు దాడికి దిగి రచ్చరచ్చ చేశారు. ఆ పేయింటింగ్స్ వేసిన కళాకారుల్లో ఒకరిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని చిత్రాలను ఎత్తి కిందపడేసి ధ్వంసం చేశారు. మరో పెయింటింగ్‌ను ఎత్తుకెళ్లారు. గురువారం జైపూర్‌లో కళలపై సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొన్ని అర్ధనగ్న చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
దీంతో సభ్యసమాజం సిగ్గుపడేలా అర్థనగ్న చిత్రాలు ప్రదర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రీయ హిందూ ఏక్ తాకు చెందిన కొందరు, లాల్ సేన అనే సంస్థకు చెందిన అధ్యక్షురాలు హేమలత శర్మ ఇంకొందరు దాడికి దిగారు. ఇలాంటివాటికి ఒప్పుకోబోమంటూ ఆందోళన చేశారు. హేమలత చాలా సీరియస్‌గా పెయింటిగ్స్ వేసిన వ్యక్తికి వార్నింగ్ ఇచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ పేయింటింగ్స్ పేరిట, స్వేచ్ఛ పేరిట మహిళల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని, బొమ్మలు గీసుకోవాలనుకుంటే ప్రకృతిలో వేరే ఏ అంశాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని క్షమించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.