‘నా పేరుతో ఇలాంటి దాడులు చేయకండి’ | Shashi Tharoor Tweets Cartoon About Mob Lynching | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేస్తున్న శశి థరూర్‌ ట్వీట్‌

Published Wed, Jun 26 2019 4:54 PM | Last Updated on Wed, Jun 26 2019 6:40 PM

Shashi Tharoor Tweets Cartoon About Mob Lynching - Sakshi

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది వరకూ గో రక్షకులు పేరిట మూక దాడులు జరగ్గా.. ప్రస్తుతం జై శ్రీరాం నినాదం తెర మీదకు వచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరవల్వడమే కాక ఆలోచింపజేసే విధంగా ఉంది.

కార్టునిస్ట్‌ సతీష్‌ వేసిన ఈ కార్టున్‌ని శశి థరూర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనిలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొడుతూ.. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ హింసిస్తున్నారు. ఆ పక్కనే వారికి కొద్ది దూరంలో శ్రీ రాముడు నా పేరు చెప్పి ఇలాంటి అకృత్యాలు చేయకండి అంటూ విలపిస్తున్నాడు. చూడ్డానికి సాధరణంగా ఉన్న ఈ కార్టూన్‌.. ఆలోచింపజేసే విధంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్‌లో దొంగతనం చేశాడనే నేపంతో ఓ ముస్లిం యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హింసించి అతని చేత బలవంతంగా జై శ్రీ రాం నినాదాలు చేయించిన సంగతి తెలిసిందే.
 

దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువకుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా.. బాధితుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడిని పోలీసులు ఏ మాత్రం కనికరం లేకుండా కాలర్‌ పట్టుకుని లాక్కొస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement