
బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పదవీకాలంలో తమ ప్రభుత్వం వాగ్ధానాలు చేయడంలోనే మెరుగ్గా వ్యవహరించిందని అన్నారు. హామీల మీద హామీలు గుప్పించడంలో తమది మెరుగైన పార్టీగా మాత్రమే తాను చెప్పగలనని ట్వీట్ చేశారు. పార్టీని పలు సందర్భాల్లో ఇరుకునపెడుతున్న శత్రుజ్ఞ సిన్హా మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని సైతం వాడుకున్నారు.
బీజేపీ విధానాలను బాహాటంగా తప్పుపట్టిన సిన్హా ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కేవలం పంజాబ్, పుదుచ్చేరి, పరివార్‌లకే పరిమితమవుతుందని మోదీ వ్యాఖ్యలపై సిన్హా మండిపడిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీని జైళ్లు, ధరల పెరుగుదల, పకోరా పార్టీగా కాంగ్రెస్ అభివర్ణిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాపులర్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)గా ఎదుగుతుందని ఆశిద్దామని సిన్హా పేర్కొనడం గమనార్హం.