
సియోల్: పాకిస్తాన్ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లారు. అయితే అక్కడ పాక్ మద్దతుదారులు కొందరు భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో షాజియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు.
షాజియా నిరసనకారుల భావోద్వేగాలపై స్పందిస్తూ.. ‘ఆర్టికల్ 370 రద్దు చేయడంపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ, మొత్తం దేశాన్ని నిందించడం సబబు కాదు. ఈ అంశం మాదేశ అంతర్గత సమస్య. దీనిపై మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. కొన్ని దేశాలలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. నిరసన తెలిపే హక్కును ఎవరైనా సక్రమంగా వినియోగించుకోవాలి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తే ఏ పరిణామాన్నైనా నేను దైర్యంగా ఎదుర్కొంటాన’ని అన్నారు. కాగా నిరసనకారుల తీవ్రత దృష్ట్యా పోలీసులు షాజియాను, ఆమె సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు.