‘ఆమె పోలీసుల వద్దకు వెళితే బావుండేది’
తిరువనంతపురం: నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు. ‘అంత వేగంగా స్పందించి ఆమె చేసిన పనికి కొంత సంతోషపడవచ్చు. కానీ, చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది’ అని థరూర్ ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆమెపట్ల తనకు సానుభూతి ఉందన్న థరూర్ ఎంతోమందికి కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పారు. న్యాయాన్ని గెలిపించే సమాజమే మనకు కావాలిగానీ, ఇలా ప్రతి ఒక్కరు ఆమె చేతులోని కత్తి ద్వారా న్యాయం పొందాలని అనుకోకూడదన్నారు.
స్వామిజీ ముసుగులో గణేశానంద తీర్థపాద(54) అలియాస్ హరిస్వామి అనే ఓ దొంగ స్వామి ఎనిమిదేళ్లుగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (23)పై లైంగిక దాడి చేస్తున్నాడు. బాధితురాలి తండ్రి కొన్నేళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడడంతో ఆయనకు వ్యాధి నయం చేసేందుకు పూజలు చేస్తానంటూ కొల్లాం పన్మాన ఆశ్రమానికి ఈ దొంగ స్వామిజీ వారి ఇంటికి వచ్చి అవకాశం దొరికినప్పుడల్లా బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలాంటి ప్రయత్నమే అతడు మరోసారి చేయబోగా ఆమె అతడి జననాంగం కోసింది. ఈ ఘటన ఇప్పుడు కేరళలో సంచలనం అయింది.