రేప్ చేయబోతే.. కోసి పారేసింది!
- జననాంగాన్ని కత్తిరించిన కేరళ యువతి
- సాహసోపేతమైన చర్య: సీఎం అభినందన
తిరువనంతపురం: స్వామీజీ ముసుగులో ఆరేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ నకిలీ బాబాకు ధైర్యంగా బుద్ధి చెప్పిందో కేరళ యువతి. శుక్రవారం ఆమె ఇంటికి వచ్చిన అతను మరోసారి అత్యాచారం చేయబోగా జననాంగాన్ని కోసేసింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు చెప్పారు. న్యాయశాస్త్ర విద్యార్థిని (23) అయిన బాధితురాలి తండ్రి కొన్నేళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడ్డారు. ఆయనకు వ్యాధి నయం చేసేందుకు పూజలు చేస్తానంటూ కొల్లాం పన్మాన ఆశ్రమానికి చెందిన గంగేశానంద తీర్థపాద (54) అలియాస్ హరిస్వామి కొన్నేళ్లుగా యువతి ఇంటికి వస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
గంగేశానంద శుక్రవారం రాత్రి మరోసారి అత్యాచారానికి యత్నించబోగా తీవ్రంగా ప్రతిఘటించిన యువతి కత్తితో అతడి జననాంగాన్ని కోసేసింది. తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు గంగేశానంద మొదటిసారి అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. ఇన్నాళ్లు అత్యాచారం చేస్తున్న సంగతి తన తల్లికి తెలుసని చెప్పింది. ఈ కేసులో యువతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, గంగేశానంద చాలా మంచివాడని, అలాంటి పనులు చేయడని దర్యాప్తులో తల్లి సమర్థించినట్టు స్థానిక మీడియా కథనం. శనివారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో గంగేశానంద ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతడికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించాక అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. యువతి ఫిర్యాదు మేరకు బాలలపై లైంగిక వేధింపుల చట్టం (పోస్కో), ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద గంగేశానందపై కేసులు నమోదు చేసినట్టు వారు వెల్లడించారు. అయితే జననాంగాన్ని తానే కోసేసుకున్నానని గంగేశానంద పోలీసులకు చెప్పడం గమనార్హం.
ఆమెకు అండగా ఉంటాం: పినరయి
ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్... ఇది ధైర్యమైన, సాహసోపేతమైన చర్య అని యువతిని అభినందించారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
ఆమెది నేరం కాదు.. : నకిలీ బాబా పురుషాంగాన్ని కోసేసినా, యువతిపై పోలీసులు ఎలాంటి కేసూ పెట్టలేదు. ఎందుకంటే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 100 ప్రకారం ప్రాణహాని ఉన్నప్పుడు దాడి చేస్తున్న వ్యక్తిని బాధితులు చంపినా నేరం కాదు. మరి ఈ మహిళను బాబా అత్యాచారం చేయబోయాడు కానీ చంపబోలేదు కదా అంటే...ఆమె గౌరవం పోయిన తర్వాత ప్రాణానికి ఉండే విలువేమిటి? కాబట్టి తన గౌరవాన్ని కాపాడుకోడానికి ఆమె బాబాను చంపేసినా నేరం కాదు. ఇదే చట్టం కిడ్నాప్ సమయంలోనూ వర్తిస్తుంది.