యూపీలో కొత్త పార్టీ..!
► సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా స్థాపిస్తా..
► ములాయం జాతీయ అధ్యక్షునిగా ఉంటారు: శివపాల్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పేరిట కొత్త పార్టీ స్థాపించనున్నట్టు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ ప్రకటించారు. ఈ పార్టీకి ములాయం నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. శుక్రవారం ఎతావాలో బంధువుల నివాసంలో ములాయంతో సమావేశమైన అనంతరం శివపాల్ ఈ ప్రకటన చేశారు.
‘పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగిస్తానని అఖిలేశ్ హామీ ఇచ్చాడు. ఆ హామీ నెరవేర్చాలి. అందరం కలసి సమాజ్‌వాదీ పార్టీని పటిష్టపరచాలి. అఖిలేశ్‌కు మూడు నెలల సమయం ఇస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ పగ్గాలను ములాయంకు అప్పగించాలి. ఒకవేళ అతను పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగించడంలో విఫలమైతే.. నేను కొత్త పార్టీ స్థాపిస్తా’ అని బుధవారమే శివపాల్ చెప్పారు.
దేశానికి మంచిదే: అఖిలేశ్
శివపాల్ హెచ్చరికలపై అఖిలేశ్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి మీడియా ద్వారానే తెలుసుకున్నానని, అలాంటి పార్టీ ఏర్పాటైతే అది దేశానికి మంచిదేనని అన్నారు. యూపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, శివపాల్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.