
భోపాల్/ఇండోర్: పనామా పేపర్ల అవినీతి కేసులో తనపై రాహుల్ అసత్య ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ కొడుకు కార్తికేయ మంగళవారం రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సోమవారం జబువాలో రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తూ సీఎంపై ఈ ఆరోపణలు చేశారు. అనంతరం తన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారు.
‘నేను కొంత గందరగోళానికి గురయ్యాను, శివరాజ్‌సింగ్ కుమారుడికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు’ అని అనంతరం రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే రాహుల్ ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగం కలిగించారని కార్తికేయ తన లాయర్ శిరీష్ శ్రీవాస్తవ ద్వారా ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి ఎదుట దావా వేశారు. ఒకవేళ పరువు నష్టం దావా నిరూపితమైతే భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. కోర్టు కార్తికేయ వాదనను విన్న తరువాత కేసును నవంబర్ 3కు వాయిదా వేసింది.