బాలీవుడ్‌తో పోలిస్తే మరాఠీ సినిమాల్లోనే సరుకు ఎక్కువని నటుడు నటుడు శ్రేయాస్ తల్పాడే పేర్కొన్నాడు. ‘హిందీ సినిమాలు అందులోని స్టార్‌లపై ఆధారపడి ఉంటాయి. అయితే మరాఠీ సినిమాలు అలా కాదు. వీటిలో కథాబలం ఎక్కువగా ఉంటుంది. కథ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాకు పట్టం కడతారు. ఇటీవలి కాలంలో మరాఠీ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నటన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు అనేకమంది ముందుకొస్తున్నారు’ అని అన్నాడు. కాగా తల్పాడే నిర్మిస్తున్న ‘పోస్టర్ బోయ్జ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘ఇదొక కుటుంబ కథాచిత్రం. వినోదాత్మకంగా ఉంటుంది. వివిధ వయస్సుల్లో ఉన్న ముగ్గురి మధ్యే ఈ సినిమా తిరుగుతుంది. ఆ ముగ్గురి పాత్రలను దిలీప్ ప్రభావల్కర్, హృషికేశ్ జోషి, అనికేత్ విశ్వాస్‌రావ్‌లు పోషిస్తున్నారు.
విచిత్రమైన పరిస్థితులు వారికి ఎదురవుతాయి. వాటిని వారంతా ఏవిధంగా విజయవంతంగా అధిగమించారనేదే ఈ సినిమా కథ’ అని అన్నాడు. శ్రేయాస్ తల్పాడే నిర్మాణంలో విడుదలైన తొలి మరాఠీ సినిమా ‘సనయ్ చౌగుడే’. ‘ఇక్బాల్’ సినిమా ద్వారా శ్రేయాస్ తొలిసారిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ హాస్యకథాచిత్రాల వైపు మళ్లాడు. అప్‌నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్ రిటర్న్స్, హౌస్‌ఫుల్ 2 తదితర సినిమాల్లో నటించిన తల్పాడే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తల్పాడే నటించిన ‘దోర్, వెల్కం టు సజ్జన్‌పూర్’ సినిమాలు విమర్శకుల మెప్పు పొందాయి. అయితే అతడు నటించిన ‘జోకర్’, కమాల్ ఢమాల్ మాలామాల్’ సినిమాలు అంతబాగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌కు కొంచెం విరామమివ్వాలని నిర్ణయించుకున్నాడు.
మరాఠీ సినిమాలే నయం
Published Tue, Jun 3 2014 9:58 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement