
డెయిలీ సీరియల్‌లో సోనాలీ బింద్రే
న్యూఢిల్లీ: అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్‌లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్‌లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు.
ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ లో నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్‌లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు.
ఏక్తాకపూర్‌కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు.